Royal Challengers Bangalore: పాపం బెంగళూరు.. రస్సెల్ వీరబాదుడుతో విజయాన్ని లాగేసుకున్న కోల్‌కతా

  • ఓటమి నుంచి విజయంవైపు లాక్కెళ్లిన రస్సెల్
  • బెంగళూరు బౌలర్లకు ఊచకోత
  • ఆడిన ఐదు మ్యాచుల్లోనూ ఓడిన బెంగళూరు

బెంగళూరును పరాజయాలు వీడడం లేదు. కోల్‌కతాతో శుక్రవారం రాత్రి జరిగిన ఐదో మ్యాచ్‌లోనూ ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసి 206 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ కోల్‌కతా ఆటగాడు ఆండ్రూ రస్సెల్ విజయాన్ని గుంజుకున్నాడు. బెంగళూరు బౌలర్లను ఉతికి ఆరేసి జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించాడు. బెంగళూరుకు తొలి విజయం దక్కబోతోందన్న ఆనందాన్ని రస్సెల్ అమాంతం లాగేసుకున్నాడు. 13 బంతుల్లో ఫోర్, 7 సిక్సర్లతో ఏకంగా 48 పరుగులు చేసి మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు గత ప్రదర్శనకు భిన్నంగా ఆడింది. కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది. 49 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. ఏబీ డివిలియర్స్ కూడా చెలరేగిపోయాడు. 32 బంతుల్లో 5 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. చివర్లో మార్కస్ స్టోయినిస్ 13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 28 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

206 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 19.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. క్రిస్ లిన్ 43, రాబిన్ ఉతప్ప 33,  నితీశ్ రాణా 37 పరుగులు చేశారు. ఓ దశలో కోల్‌కతా ఓటమి ఖాయమని అందరూ భావించారు. అయితే, ఆండ్రూ రస్సెల్ క్రీజులోకి వచ్చిన తర్వాత ఆట స్వరూపం మారిపోయింది. బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశాడు. అతడి దెబ్బకు మహ్మద్ సిరాజ్ 2.2 ఓవర్లలో ఏకంగా 36 పరుగులు సమర్పించుకున్నాడు.

మొత్తంగా 13 బంతులు ఎదుర్కొన్న రస్సెల్ 48 పరుగులు చేసి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అతడికే దక్కింది. ఈ ఓటమితో బెంగళూరు ఖాతాలో మరో ఓటమి చేరింది. ఆడిన  ఐదు మ్యాచుల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.

More Telugu News