Mosquito: ఈ సంగీతం వింటే మగ దోమలు గాళ్ ఫ్రెండ్స్ ను కూడా మర్చిపోవాల్సిందే!

  • దోమల పాలిట చరమగీతం
  • దోమలపై డబ్ స్టెప్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్రభావం
  • మ్యూజిక్ వినిపిస్తే చాలు దోమలు పరార్!

మానవవాళికి మొదటి నుంచి దోమలతో ఉన్న వైరం తెలిసిందే! తమ ఆహార వేటలో భాగంగా మనుషులను కుట్టి రక్తం పీల్చడం దోమల జీవనశైలిలో భాగం. ఆ దోమలతో కుట్టించుకుని, ఆపై వచ్చే రోగాలతో మానవులు ఎన్ని అగచాట్లు పడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా తప్పదు. అందుకే దోమకాటు నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు మానవుడు. మస్కిటో రిపెల్లెంట్లు, కాయిల్స్, లిక్విడ్లు అంటూ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నా దోమలను నాశనం చేయడం మాత్రం ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు.

అయితే, ఇటీవల ఓ పరిశోధనలో ఆసక్తికర విషయం వెల్లడైంది. దోమలకు ఓ ప్రత్యేకమైన సంగీతం వినిపిస్తే అవి తమ లయను కోల్పోతున్నట్టు గుర్తించారు. డబ్ స్టెప్ అనే ఎలక్ట్రానిక్ మ్యూజిక్ విన్న దోమలు తమను తాము మర్చిపోయి అయోమయానికి గురవుతున్నాయట. డబ్ స్టెప్ తరహాలో స్క్రిల్లెక్స్ బ్యాండ్ రూపొందించిన 'స్కేరీ మాన్ స్టర్స్ అండ్ నైస్ స్ప్రైట్స్' సాంగ్ ను దోమలకు వినిపిస్తే ఆడదోమలు మనుషులను కుట్టడం బాగా తగ్గించేశాయట. ఇక మగదోమలైతే ఆడదోమలతో సంగమాన్ని కూడా మర్చిపోయి దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నాయట.

ఈ సంగీతంలో పొందుపరిచిన శబ్దతరంగాలు అధిక పౌనపున్యంతో కూడినవి కావడంతో అవి దోమల పాలిట పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని తెలుసుకున్నారు. దోమలు హై ఫ్రీక్వెన్సీ ధ్వనులను తట్టుకోలేవు. అలాంటి శబ్దాలు వినిపిస్తే వాటికి రక్తం పీల్చాలన్న కోరికతో పాటు  ఆడ దోమలతో పునరుత్పత్తి ప్రక్రియలో పాల్గొనాలన్న వాంఛ కూడా చచ్చిపోతుందట. డబ్ స్టెప్ సంగీతం ప్రధానంగా దోమల మధ్య సాగే సంకేతాలను అడ్డుకుంటున్నట్టు పరిశోధనలో తేలింది. ఈ మేరకు 'ఆర్కటా ట్రోపికా' అనే పత్రికలో కథనం వెలువరించారు.

More Telugu News