Kuppam: చంద్రబాబును ఓడించిన చంద్రగిరిని గుర్తు తెచ్చుకోండి... కుప్పంలో వైఎస్ జగన్!

  • చంద్రగిరిలో గెలవలేక కుప్పం వచ్చారు
  • ఆదరించిన ప్రజలకు ఆయనేం చేశారు
  • సొంత మనుషులకే అన్యాయం చేసిన బాబు
  • ఈ దఫా ఓడించాలని జగన్ పిలుపు

రానున్న ఎన్నికల్లో కుప్పం ప్రజలు చంద్రబాబునాయుడిని ఓడించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ ఉదయం కుప్పంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన, చంద్రబాబును చంద్రగిరి ప్రజలు తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఓ మారు చంద్రగిరి నుంచి గెలిచిన ఆయన, రెండోసారి భారీ తేడాతో ఓడిపోయారని, అదే స్ఫూర్తిని కుప్పం ప్రజలు ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. చంద్రగిరిలో గెలవలేనన్న భయంతో 30 ఏళ్ల క్రితం చంద్రబాబు తన నియోజకవర్గాన్ని ఇక్కడికి మార్చుకున్నారని, అప్పటి నుంచి ఆదరిస్తున్న ప్రజలకు ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. నియోజకవర్గమైనా ఒక్క డిగ్రీ కాలేజీ కూడా లేదని, పొలాలకు నీరు లేదని, నీరందే పొలాలకు కరెంట్ లేదని అన్నారు.

కుప్పంలో వైసీపీని గెలిపిస్తే, ఇక్కడి ప్రజలకు అభివృద్ధి ఎలా ఉంటుందో తాను చూపిస్తానని జగన్ హామీ ఇచ్చారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన ఈ పెద్దమనిషి, తన తల్లి పేరిట ఉన్న ఆస్తిని తన తోడబుట్టిన వాళ్లకు ఇవ్వకుండా కాజేశారని ఆరోపించారు. వాటన్నింటినీ తన కొడుకు నారా లోకేశ్ పేరిట రాయించి పెట్టుకున్న ఘనత ఆయనదని అన్నారు. సొంత తమ్ముడికి, చెల్లెళ్లకు వెన్నుపోటు పొడిచి, ఆస్తి దక్కకుండా చేసిన చంద్రబాబు, ఇక రాష్ట్ర ప్రజలకు అండగా ఏముంటారని ప్రశ్నించారు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అన్న చేసిన పనులకు తీవ్ర మనోవేదనకు గురయ్యారని, ఆయన ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొనివుందని అన్నారు.

More Telugu News