Tamilnadu: ఆ విషయమై మాట్లాడారో.. బెయిల్ రద్దు చేస్తాం!: స్టాలిన్ కు మద్రాస్ హైకోర్టు వార్నింగ్

  • కొడనాడు ఎస్టేట్  ఉదంతంపై స్టాలిన్ విమర్శలు
  • పరువునష్టం దావా దాఖలుచేసిన సీఎం పళనిస్వామి
  • మరోసారి మాట్లాడితే బెయిల్ రద్దవుతుందన్న ధర్మాసనం

తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కు మద్రాస్ హైకోర్టు హెచ్చరికలు చేసింది. కొడనాడు ఎస్టేట్ హత్యల మిస్టరీపై స్టాలిన్ మాట్లాడకుండా ఉంటేనే ఆయన బెయిల్ కొనసాగుతుందనీ, లేదంటే బెయిల్ ను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా స్టాలిన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు కొడనాడులో ఓ ఎస్టేట్ ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయలలిత ఇక్కడి నుంచి కూడా పాలన సాగించేవారు. అయితే ఆమె మరణం అనంతరం ఈ ఎస్టేట్ లో గతేడాది ఏప్రిల్ 24న దొంగతనం జరిగింది. ఈ సందర్భంగా దుండగులు సెక్యూరిటీ గార్డును కిరాతకంగా హత్య చేశారు.

అయితే ఈ దోపిడీని సీఎం పళనిస్వామి చేయించారని స్టాలిన్ ఆరోపించడంతో పళనిస్వామి మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ కొడనాడు ఎస్టేట్ పై వ్యాఖ్యలు చేయరాదనీ, ఒకవేళ చేస్తే ఇప్పటికే మంజూరు చేసిన బెయిల్ రద్దు అవుతుందని హైకోర్టు హెచ్చరించింది.

More Telugu News