Chandrayaan 2: చంద్రయాన్-2 మూన్ ల్యాండర్‌‌ కాళ్లలో లోపాలు.. ప్రయోగం వాయిదా

  • చంద్రయాన్-2 ప్రాజెక్టు ఖర్చు రూ.800 కోట్లు
  • డ్రాప్ టెస్టులో లోపాలను గుర్తించిన శాస్త్రవేత్తలు
  • మే వరకు హోల్డ్‌లో ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం వాయిదా పడింది. బహుశా ఈ ఏడాది ద్వితీయార్థంలో దీనిని ప్రయోగించే అవకాశం ఉందని సమాచారం. డ్రాప్ టెస్టులో భాగంగా మూన్ ల్యాండర్‌ కాళ్లలో లోపాలను గుర్తించినట్టు ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. మూన్ ల్యాండర్ బరువును మోయగలిగేంత సామర్థ్యం దానికి అమర్చిన కాళ్లలో లేదని డ్రాప్ టెస్టులో తేలిందన్నారు. దీంతో ప్రయోగాన్ని మే నెల వరకు హోల్డ్‌లో పెట్టినట్టు చెప్పారు. 800 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఈ మిషన్‌లో భాగంగా ఏప్రిల్ రెండో వారంలో చంద్రయాన్-2ను ప్రయోగించనున్నట్టు జనవరిలో ఇస్రో వెల్లడించింది.  

చంద్రయాన్-1లా కాకుండా చంద్రయాన్-2లో చాలా ప్రత్యేకతలున్నాయి. ఇందులో భాగంగా చంద్రుడిపై ఓ రోవర్‌ను దింపుతారు. మరో ఉపగ్రహం చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తుంది. చంద్రుడిపైకి దింపిన రోవర్‌లో సిస్మోమీటర్, థర్మల్ ప్రోబ్ వంటివి ఉంటాయి. అలాగే, చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టిని పరీక్షించేందుకు స్పెక్ట్రోమీటర్‌ను కూడా ఇది మోసుకెళ్తుంది.

More Telugu News