Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో అర్ధరాత్రి నుంచి ఉగాది సంబరాలు!

  • సుప్రభాత సేవ తర్వాత కార్యక్రమాలకు శ్రీకారం
  • రేపు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం
  • బంగారు వాకిలి ఎదుట కార్యక్రమం

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈరోజు అర్ధరాత్రి తర్వాత నుంచి ఉగాది సంబరాలు ప్రారంభంకానున్నాయి. అర్ధరాత్రి ఒంటి గంటకు స్వామివారి సుప్రభాత సేవ తర్వాత ఉగాది కార్యక్రమాలు మొదలుకానున్నాయి. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పూర్తి చేశారు. ఆలయానికి టీటీడీ ఉద్యాన శాఖ చేసిన రంగురంగుల పుష్పాలంకరణ ఆకట్టుకుంటోంది. విద్యుత్‌ దీపాలంకణతో స్వామివారి ఆలయం ప్రత్యేకంగా దర్శనమిస్తోంది.

ఇక శనివారం ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. బంగారు వాకిలి ఎదుట గరుడాళ్వారుకు అభిముఖంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామికి ఆహ్వానం పలికి దక్షిణాభిముఖంగా కొలువుదీరుస్తారు. అనంతరం ఉగాది ఆస్థానాన్ని నిర్వహించనున్నారు.

ఉగాది ఆస్థానం అనంతరం శ్రీవారి పాదపద్మాల మీదున్న శ్రీవికారి నామసంవత్సర పంచాంగాన్ని ఆస్థాన సిద్ధాంతి స్వీకరించి పంచాంగ శ్రవణం చేస్తారు. తొలుత శ్రీవారికి నూతన సంవత్సర విశేషాలను వివరిస్తారు. ముఖ్యంగా శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణం ఫలితాలు వివరిస్తారు.

శ్రీదేవి, భూదేవికు కూడా నక్షత్ర ఫలాలు నివేదిస్తారు. శనివారం సాయంత్రం చతుర్మాడ వీధుల్లో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీమలయప్పస్వామి బంగారు పల్లకిపై ఊరేగుతూ  నూతన సంవత్సర శుభాశీస్సులతోపాటు దివ్యమంగళ దర్శనంతో భక్తకోటిని అనుగ్రహించనున్నారు.

More Telugu News