VK Singh: ఆర్మీని మోదీ సేన అంటారా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం

  • ఇండియన్ ఆర్మీని మోదీ సేనగా అభివర్ణించిన యోగి
  • నోటీసులు పంపిన ఈసీ
  • అలా అన్నవారు దేశద్రోహులన్న వీకే సింగ్

ఆర్మీని ‘మోదీ సేన’గా అభివర్ణించిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ మండిపడ్డారు. సైన్యాన్ని ‘మోదీ సేన’గా అభివర్ణించేవారు దేశ ద్రోహులే అవుతారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చెప్పడం తప్పు మాత్రమే కాదని, దేశద్రోహం కూడా అని మంత్రి పేర్కొన్నారు.  

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో వందలాదిమంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవల బీజేపీ ప్రచార సభలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం ఉగ్రవాదులపై విరుచుకుపడుతోందని, కాంగ్రెస్ మాత్రం ఉగ్రవాదులకు బిరియానీ పెట్టిందని ఆరోపించారు. ‘మోదీ సైన్యం’ బాంబులు, బుల్లెట్లతో స్పందిస్తోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగి వ్యాఖ్యలపై స్పందించిన ఈసీ ఆయనకు నోటీసులు పంపింది.  

యోగి వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత వీకే సింగ్ మాట్లాడుతూ.. భారత సైన్యాన్ని ఎవరైనా మోదీ సేన అనడం ముమ్మాటికీ తప్పేనన్నారు. అలా పేర్కొన్నవారు దేశానికి విశ్వాసఘాతకుడు కూడా అవుతాడని అన్నారు. ఆర్మీ దేశానికి చెందినదని, అది ఓ రాజకీయ పార్టీకి చెందినది కాదని సింగ్ తెగేసి చెప్పారు. కాగా, ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా విశేష సేవలు అందించిన వీకే సింగ్ పదవీ విరమణ అనంతరం బీజేపీలో చేరారు. ప్రస్తుత మోదీ ప్రభుత్వంలో ఆయన విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా ఉన్నారు.

More Telugu News