BJP: ఎన్నికలకు ముందు ఎస్పీ-బీఎస్పీలకు భారీ షాక్.. బీజేపీలో చేరిన ప్రవీణ్ నిషాద్

  • గోరఖ్‌పూర్ ఉప ఎన్నికలో ఎస్పీ టికెట్‌పై గెలిచిన ప్రవీణ్
  • గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్న నిషాద్
  • మళ్లీ అదే స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ

ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్, మాయావతిలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది గోరఖ్‌పూర్‌కు జరిగిన ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మద్దతుతో విజయం సాధించిన నిషాద్ పార్టీ నేత ప్రవీణ్ నిషాద్ ఆ రెండు పార్టీలకు షాకిచ్చారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. కమలం పార్టీలో చేరిన ఆయనకు టికెట్ కూడా వెంటనే ఖరారైపోయింది. సిట్టింగ్ స్థానం నుంచే ఆయన ఈ ఎన్నికల్లోనూ బరిలోకి దిగనున్నట్టు సమాచారం.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధించిన తర్వాత గోరఖ్‌పూర్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యోగి ఆదిత్యానాథ్‌ను బీజేపీ ముఖ్యమంత్రిని చేసింది. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికను సవాలుగా తీసుకున్న ఎస్పీ-బీఎస్పీలు తమ ఉమ్మడి అభ్యర్థిగా ప్రవీణ్ నిషాద్‌ను బరిలోకి దింపాయి. సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై పోటీ చేసిన ఆయన సంచలన విజయం సాధించారు. కాగా, తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీలు మరోమారు చేతులు కలిపాయి. ఈ క్రమంలో టికెట్ల కేటాయింపు విషయంలో భేదాభిప్రాయాల కారణంగా నిషాద్ పార్టీ ఇటీవల ఈ కూటమి నుంచి బయటకొచ్చింది. ఇప్పుడు ప్రవీణ్ నిషాద్ ఏకంగా బీజేపీలో చేరి ఆ రెండు పార్టీలకు షాకిచ్చారు.

More Telugu News