Saudi Arebia: సౌదీలో న్యూక్లియర్ రియాక్టర్... తొలి శాటిలైట్ ఇమేజ్!

  • పూర్తి కావొచ్చిన తొలి రియాక్టర్
  • మిగతా పనులు శరవేగం
  • అణ్వాయుధాల తయారీ జరుగుతోందని ఆరోపణలు
  • ఖండించిన సౌదీ అరేబియా ఇంధన మంత్రి

ఎడారి దేశమైన సౌదీ అరేబియాలో తొలి అణు రియాక్టర్ నిర్మాణం పూర్తి కావొచ్చింది. దీని శాటిలైట్ ఇమేజ్ లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతర్జాతీయ అణు నిబంధనలపై సంతకం చేయకుండానే సౌదీ, రియాక్టర్ నిర్మాణానికి పూనుకుందని ఇటీవలి కాలంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ అణు కేంద్రం రియాద్ నగర పరిధిలోని కింగ్ అబ్దులాజిజ్ సిటీ ఫర్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలోనే నిర్మితమైంది. గూగుల్ ఎర్త్ ఇమేజ్ లు చూపిస్తున్న వివరాల ప్రకారం, తొలి దశ పనులు పూర్తికాగా, మిగతా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అణు ఇంధనం కలిగిన వెసెల్స్ సైతం సమీపంలోనే ఉన్నాయని తెలుస్తోంది.

కాగా, ఇప్పటివరకూ అణు ఇంధనంపై అంతర్జాతీయ దేశాలతో సౌదీ ఎటువంటి ఒప్పందాలు చేసుకోకపోవడం, కేవలం పౌర అవసరాలకు మాత్రమే అణు విద్యుత్ ను వినియోగించేందుకు తయారుచేసిన ఒప్పందం పత్రంపై సంతకం చేయకపోవడంతో పలు దేశాలు సౌదీ చర్యలపై అభ్యంతరం వెలిబుచ్చుతున్నాయి. ఈ కేంద్రంలో అణ్వాయుధాల తయారీ జరగవచ్చన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వియన్నాలోని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజన్సీ ఇప్పటికే, సౌదీ అరేబియాను ఉద్దేశించి ఈ విషయంలో హెచ్చరికలు సైతం జారీ చేసింది. "ఈ శాటిలైట్ చిత్రాలు సౌదీలో తొలి న్యూక్లియర్ ప్లాంటు ఏర్పాటవుతోందని స్పష్టంగా చెబుతున్నాయి" అని ఐఏఈఏ మాజీ డైరెక్టర్, యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎనర్జీ రిమోట్ సెన్సింగ్ లాబొరేటరీకి నేతృత్వం వహిస్తున్న రాబర్ట్ కెల్లీ వ్యాఖ్యానించారు.

కాగా, ఈ విషయంలో స్పందించిన సౌదీ అరేబియా ఇంధన మంత్రి, తాము కేవలం శాంతియుత సాంకేతిక పరిజ్ఞాన సముపార్జనకే కట్టుబడివున్నామని, రీసెర్చ్, ఎడ్యుకేషనల్, ట్రైనింగ్ కార్యకలాపాలకు మాత్రమే ఈ కేంద్రాన్ని వినియోగించనున్నామని అన్నారు.

More Telugu News