IPL: ఐపీఎల్‌లో సబ్‌స్టిట్యూట్ విధానం దుర్వినియోగం అవుతోంది: కైఫ్ సంచలన వ్యాఖ్యలు

  • సబ్‌స్టిట్యూట్ విధానాన్ని కొన్ని జట్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి
  • వెంటనే దీనిని మార్చాలి
  • గాయం పేరుతో ఏమారుస్తున్నారు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సబ్‌స్టిట్యూట్ (ప్రత్యామ్నాయ ఆటగాడు) విధానం దుర్వినియోగం అవుతోందని ఢిల్లీ కేపిటల్స్  అసిస్టెంట్ కోచ్ మహమ్మద్ కైఫ్ సంచనల వ్యాఖ్యలు చేశాడు. తక్షణమే దీనిని మార్చాలని డిమాండ్ చేశాడు. ఫీల్డింగ్‌లో ఆటగాడు గాయపడినప్పుడు అతడి స్థానంలో మరో ఆటగాడిని మైదానంలోకి రప్పించడమే సబ్‌స్టిట్యూట్ విధానం. అయితే, చాలా జట్లు దీనిని దుర్వినియోగం చేస్తున్నాయని, ఫీల్డింగ్‌లో చురుగ్గా లేని ఆటగాళ్లను గాయం పేరుతో డ్రెస్సింగ్ రూముకు పంపి అతడి స్థానంలో మంచి ఫీల్డర్లను రప్పించుకుంటున్నారని ఆరోపించాడు. గాయం పేరుతో ఏమారుస్తున్నారని ఆరోపించాడు. ఈ విషయాన్ని మ్యాచ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌-ఢిల్లీ కేపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాగే జరిగిందని, ఫీల్డింగ్‌లో అంత చురుగ్గా ఉండని 30 ఏళ్ల పీయూష్ చావ్లా స్థానంలో 21 ఏళ్ల యువ ఆటగాడు రింకు సింగ్‌ను సబ్‌స్టిట్యూట్‌గా తీసుకున్నారని తెలిపాడు. అలాగే, కింగ్స్ ఎలెవన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్‌కు గాయం కాకున్నా మరో చురుకైన ఆటగాడిని తీసుకున్నారని కైఫ్ గుర్తు చేశాడు. ఈ విధానాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, అంపైర్ల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తానని పేర్కొన్నాడు.

More Telugu News