BSNL: బీఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం.. 54 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన!

  • అప్పుల్లో కూరుకుపోయి విలవిల్లాడుతున్న సంస్థ
  • రిలయన్స్ జియో రాకతో కష్టాలు మొదలు
  • మూడోవంతు మంది ఉద్యోగులను సాగనంపేందుకు ప్రణాళిక

అప్పుల్లో కూరుకుపోయి అష్టకష్టాలు పడుతున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఉద్యోగులను తగ్గించుకోవడమే మార్గమని భావిస్తున్న సంస్థ.. మూడోవంతు మంది ఉద్యోగులను అంటే 54 వేల మందిని సాగనంపాలని నిర్ణయించింది. ఇందుకోసం కొన్ని నిబంధనలను సడలించాలని నిర్ణయించింది.

ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు తగ్గించడం, యాభై ఏళ్లకే స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశాన్ని కల్పించడం ద్వారా నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తోంది. టెలికం మార్కెట్లోకి ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ప్రవేశించాక ప్రైవేటు టెలికం ఆపరేటర్లతోపాటు బీఎస్ఎన్ఎల్ కూడా కష్టాల్లో పడింది. క్రమంగా అప్పుల్లో కూరుకుపోయి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులను తగ్గించుకోవడం ద్వారా కష్టాల నుంచి బయటపడాలని యోచిస్తోంది.

ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్‌లో 1,74,312 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగులను తగ్గించుకోవాలన్న తాజా ప్రతిపాదనతో 31 శాతం మంది (54,451 మంది) ఉద్యోగాలు కోల్పోతారు. పదవీ విరమణ వయసును తగ్గించడం ద్వారా వచ్చే ఆరేళ్లలో రూ.13,895 కోట్లు ఆదా కానుండగా, స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా ఏడాదికి రూ.1,921.24 కోట్లు ఆదా అవుతాయని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది.

More Telugu News