air pollution: షాకింగ్... రెండున్నరేళ్లు తగ్గిపోతున్న చిన్నారుల జీవితకాలం.. ఎందుకో తెలుసా?

  • 2017లో కలుషిత గాలి వల్ల 12 లక్షల మంది చనిపోయారు
  • మరణాలకు కలుషిత గాలి మూడో అతిపెద్ద కారణం
  • భయంకర నిజాలను వెల్లడించిన గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఎయిర్ పొల్యూషన్

కలుషిత గాలి వల్ల భారత్ లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని అమెరికాకు చెందిన 'గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఎయిర్ పొల్యూషన్' విడుదల చేసిన నివేదిక ప్రకంపనలు రేపుతోంది. ఒక్క 2017లోనే కాలుష్యం కారణంగా ఇండియాలో ఏకంగా 12 లక్షల మంది ప్రాణాలు విడిచారని గ్లోబల్ రిపోర్ట్ తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా, ఇన్ డోర్ పొల్యూషన్ కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పింది. కలుషిత గాలి కారణంగా స్ట్రోక్, డయాబెటిస్, హార్ట్ అటాక్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇతర శ్వాస సంబంధిత సమస్యలకు ప్రజలు గురవుతున్నారని తెలిపింది.

ఇండియాలో సంభవిస్తున్న మరణాలకు కలుషిత గాలి మూడో అతి పెద్ద కారణమని గ్లోబల్ రిపోర్ట్ వెల్లడించింది. ధూమపానం కంటే కలిషిత గాలి వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పింది. కలుషిత గాలి కారణంగా దక్షిణ ఆసియా దేశాల్లో పుడుతున్న చిన్నారుల జీవిత కాలం రెండున్నర ఏళ్లు తగ్గిపోతోందని అంచనా వేసింది.

పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్, వాహనాల స్థాయిని స్టేజ్ 6కు తీసుకురావడం, జాతీయ పరిశుభ్ర గాలి కార్యక్రమాలు రాబోయే సంవత్సరాల్లో సానుకూల మార్పులు తీసుకురావచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అయితే, ఈ కార్యక్రమాలన్నింటినీ చిత్తశుద్ధితో చేపడితేనే ఫలితం ఉంటుందని చెప్పింది. పోషకాహార లోపం, ఆల్కహాల్, శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాల వల్ల సంభవించే మరణాల కన్నా కలుషిత గాలి వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. మలేరియా, రోడ్డు ప్రమాదాల కంటే దీని వల్లే ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయని చెప్పింది.

More Telugu News