KCR: దేశం కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటోంది: మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

  • తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచింది  
  • ఈ ఎన్నికల్లో ఎన్డీఏ, యూపీఏలకు మెజార్టీ రాదు
  • ఇది ఫెడరల్‌ ఫ్రంట్‌కు కలిసి వచ్చే అవకాశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనకు ప్రధాని కావాలన్న కోరిక లేదని చెబుతుంటే, ఆయన పార్టీ నాయకులు మాత్రం గులాబీనేత ప్రధాని కావాల్సిన అవసరం ఉందంటూ జనాన్ని సందిగ్ధంలోకి నెడుతున్నారు. ఎన్నికల అనంతరం ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కాంగ్రెస్‌, బీజేపీయేతర పక్షాల ప్రభుత్వం ఏర్పడితే కేసీఆర్‌ ప్రధాని కాబోతున్నారంటూ ఊహాగానాలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, మాజీ ఉపముఖ్యమంత్రి, మండలి సభ్యుడు కడియం శ్రీహరి కూడా ఇదే పల్లవి అందుకున్నారు. దేశం కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటోందని చెప్పుకొచ్చారు. వరంగల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభ విజయవంతమైన నేపథ్యంలో ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ఎన్టీఏ, యూపీఏ కూటములకు వచ్చే ఎన్నికల్లో అవసరమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్‌ వంటి సమర్థుడైన నాయకుడు దేశానికి అవసరమని చెప్పుకొచ్చారు. తెరాసకు, మజ్లిస్‌తో కలిపి 17 ఎంపీ స్థానాలే ఉన్నా గతంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం మెజార్టీ లేకుండానే ఐదేళ్లు నడిచిన విషయాన్ని గుర్తు చేశారు.

తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శవంతమవుతున్నాయని, అందుకే కేసీఆర్‌ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. మోదీ తన ప్రసంగాల్లో దిగజారుడు తనంతో మాట్లాడుతున్నారని, బాహుబలి పాత్రను ఉదహరించడం ఇందుకు సాక్ష్యమన్నారు.

More Telugu News