Telangana: పబ్ జీ ఎఫెక్ట్.. గేమ్ ఆడొద్దని మందలించిన తల్లి.. ప్రాణాలు తీసుకున్న పదో తరగతి విద్యార్థి!

  • తెలంగాణలోని హైదరాబాద్ లో ఘటన
  • ఆఖరి పరీక్షకు ముందు గేమ్ ఆడిన బాలుడు
  • పరీక్షలు అయ్యేవరకూ చదువుకోవాలని మందలించిన తల్లి

స్మార్ట్ ఫోన్ గేమ్ పబ్ జీ కారణంగా మరో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పరీక్షల సమయంలో చదవడం మానేసి పబ్ జీ గేమ్ ఆడుతున్న ఓ బాలుడిని తల్లి మందలించడంతో అతను ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

నగరంలోని మల్కాజ్ గిరి ప్రాంతంలో విష్ణుపురి ఎక్స్ టెన్షన్ కాలనీలో భరత్ రాజ్, ఉమాదేవి దంపతులు ఉంటున్నారు. వీరికి లాహిరి అనే కుమార్తె, సాంబశివ(16) అనే కుమారుడు ఉన్నారు. పదో తరగతి చదువుతున్న సాంబశివ ఈరోజు ఆఖరి పరీక్షను రాయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సాంబశివ చదువుకోవడం మానేసి ఫోన్ లో పబ్ జీ ఆడటం మొదలుపెట్టాడు. ఇది గమనించిన తల్లి సాంబశివను మందలించింది. పరీక్షలు అయ్యేవరకూ ఆటలు పక్కనపెట్టి చదువుకోవాలని సూచించింది.

దీంతో మనస్తాపానికి లోనైన సాంబశివ తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అనంతరం టవల్ తో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కుమారుడు ఎంతకూ బయటకు రాకపోవడంతో ఉమాదేవి గదిలోకి తొంగిచూడగా, సాంబశివ నేలపై పడిపోయి కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యుడు బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సాంబశివ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉరి వేసుకున్నాక గింజుకోవడంతో బాలుడు నేలపై పడిపోయి ఉంటాడన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ విషయమై బాలుడి తల్లి ఉమాదేవి మాట్లాడుతూ.. తమ కుమారుడు 2 నెలలుగా పబ్ జీ గేమ్ కు బానిస అయ్యాడని తెలిపారు. ఆటను పక్కన పెట్టి చదువుకోవాలని పలుమార్లు హెచ్చరించినా అతను వినిపించుకోలేదని విలపించారు. అందుకే గట్టిగా మందలించాననీ, దీంతో సాంబశివ ప్రాణాలు తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News