Mayawati: రాముడి విగ్రహానికి లేని ఇబ్బంది నా విగ్రహానికే ఎందుకు?: ప్రశ్నించిన మాయావతి

  • స్మారక చిహ్నాలు, విగ్రహాలు ఏర్పాటు చేయడం దేశంలో కొత్తకాదు
  • వేల కోట్ల రూపాయలను వాటికోసం వెచ్చిస్తున్నారు
  • దళిత మహిళకు దక్కిన గౌరవం చూసి జీర్ణించుకోలేకపోతున్నారు

మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళిత నేతల పక్కన తన విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌పై బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. తన విగ్రహాలను పెట్టుకుంటే వారికి వచ్చే ఇబ్బందేమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో తనకు తెలియదన్నారు. అయోధ్యలో 221 మీటర్ల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెబుతున్నప్పుడు లేని అభ్యంతరాలు తనకు మాత్రమే ఎందుకని మాయావతి ప్రశ్నించారు.

సుప్రీంకోర్టుకు మాయావతి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ‘‘స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయడం, విగ్రహాలు ప్రతిష్ఠించడం ఈ దేశంలో కొత్తకాదు. కాంగ్రెస్ హయాంలో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు వంటి వారి విగ్రహాలను ప్రభుత్వ నిధులతో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అప్పుడు మీడియా కానీ, పిటిషనర్లు కానీ దీనిని ప్రశ్నించలేదు. వారిపై ఉన్న గౌరవంతోనే వారాపని చేయలేదు’’ అని మాయావతి ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

రూ. 3 వేల కోట్ల ప్రజాధనంతో 182 మీటర్ల సర్దార్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని మాయావతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూడా రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు రూ.200 కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు.

అలాగే, ముంబైలో శివాజీ, లక్నోలో వాజ్‌పేయి, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేశారని, కర్ణాటకలోని మాండ్యాలో రూ. 3 వేల కోట్లతో 350 అడుగుల కావేరీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉందని, ఏపీ రాజధాని అమరావతిలో రూ.155 కోట్ల ఖర్చుతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారని, తమిళనాడులో రూ. 50 కోట్లతో జయలలిత విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారని మమత తెలిపారు. కానీ తన విగ్రహాలపై మాత్రమే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ దళిత మహిళకు అంతటి గౌరవం దక్కడాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నారని మాయావతి అన్నారు.

More Telugu News