ICC: క్రికెట్ లో సంచలన మార్పులు ప్రకటించిన ఐసీసీ... 'ఏప్రిల్ ఫూల్' చేస్తోందా? అన్న అనుమానం!

  • ట్విట్టర్ లో ఎనిమిది కొత్త నిబంధనలు
  • క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయాలు చెప్పాలని కోరిన ఐసీసీ
  • ఏప్రిల్ ఫూల్ చేయడం కాదని నేను అనుకుంటున్నానన్న మైఖేల్ వాన్

యువతరానికి క్రికెట్ ను మరింత దగ్గరగా చేయాలని నిర్ణయించుకున్నామని, అందువల్ల క్రికెట్ నిబంధనల్లో కొన్ని మార్పులు ప్రకటిస్తున్నామని చెబుతూ ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో 8 ట్వీట్లు పెట్టింది. ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతుండగా, క్రికెట్ ఫ్యాన్స్ ను ఐసీసీ ఏప్రిల్ ఫూల్ చేసిందా అన్న అనుమానానం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో మైఖేల్ వాన్ వంటి మాజీ ఆటగాళ్లు, "ఇది ఏప్రిల్ ఫూల్ చేయడం కాదని నేను అనుకుంటున్నా" అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ఈ నిబంధనలేవీ నమ్మశక్యంగా లేవు. ఈ కొత్త రూల్స్ నిజంగానే రానున్నాయా? లేక ఐసీసీ ఆటపట్టించిందా? అన్న విషయంపై స్పష్టత రాలేదు. ఇక ఐసీసీ చెప్పిన మార్పులేవో ఓ మారు పరిశీలిస్తే...

* యువకులకు ఆటను చేరువ చేసేందుకు ఇకపై ఆటగాళ్ల కిట్స్‌పై జెర్సీ నెంబర్లతో పాటు వాళ్ల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల వివరాలు కూడా కనిపిస్తాయి.
* అన్ని మ్యాచుల్లో కాయిన్ టాస్‌ స్థానంలో ఎవరు బ్యాటింగ్, ఎవరు బౌలింగ్ చేయాలన్న విషయాన్ని ఫ్యాన్స్‌ ఎన్నుకొనే విధంగా ట్విట్టర్ పోల్ నిర్వహిస్తాం
* వేడి 35 డిగ్రీలను దాటితే, ఆటగాళ్లు షార్ట్స్ ధరించి ఆడుకోవచ్చు.
* మజాను మరింతగా పెంచేందుకు కామెంటేటర్లను స్లిప్స్ దగ్గర నిలబెట్టి కామెంట్రీ చేసే అవకాశం కల్పిస్తాం.
* ఫీల్డర్‌ క్యాచ్ పట్టుకున్న తరువాత, క్రీజులో లేని రెండో బ్యాట్స్‌ మెన్‌ ని రనౌట్ చేసి ఒకేసారి రెండు వికెట్లు తీసుకునే చాన్స్ కల్పిస్తాం.
* ఇకపై నోబాల్స్, వైడ్స్ లను ఏసెస్‌ గా పిలుస్తాం.
* సాయంత్రం జరిగే మ్యాచుల్లో చేసే పరుగులను ఇకపై రెట్టింపుగా లెక్కిస్తారు. అంటే ఫోర్ కొడితే 8, సిక్స్ కొడితే 12 పరుగులన్నమాట.
* వరల్డ్‌ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ టేబుల్‌ లో జట్లు సమానంగా ఉండేందుకు, మ్యాచ్ టై అయితే, టై బ్రేకింగ్‌ కి అవే రన్స్‌ ని పరిగణనలోకి తీసుకుంటాం.

ఇక ఈ మార్పులు ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి... అంటూ ఐసీసీ ట్వీట్లు చేయగా, వాటిపై పలు రకాల కామెంట్లు వస్తున్నాయి.















More Telugu News