Uttam Kumar Reddy: రాహుల్ ‘న్యాయ్’ పేరుతో సరికొత్త పథకం తేబోతున్నారు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

  • బీజేపీ అభద్రతా భావాన్ని పెంచింది
  • ఎన్నికల తరువాత ఏర్పడేది మా ప్రభుత్వమే
  • మోదీ సర్కారుకు అండగా టీఆర్ఎస్ నిలిచింది

ముస్లింలు, దళితులు, మైనార్టీ ప్రజల్లో అభద్రతా భావాన్ని బీజేపీ పెంచిందని టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. నేడు హుజూర్‌నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల తరువాత కేంద్రంలో తమ ప్రభుత్వమే ఏర్పడబోతోందన్నారు. ప్రధాని మోదీ ఐదేళ్లలో 10 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, కనీసం ఐదు లక్షల ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయాడన్నారు.

రాహుల్ ప్రధాని అయిన వెంటనే ‘న్యాయ్’ పేరుతో ఓ సరికొత్త పథకం తేబోతున్నారని, 'న్యాయ్' పథకంలో భాగం ప్రతి పేద కుటుంబం బ్యాంకు ఖాతాలో నెలకు రూ.6000 వేస్తామని తెలిపారు. అంతేగాకుండా, అధికారం చేపట్టిన తర్వాత రూ.2 లక్షల రుణమాఫీ కూడా అమలు చేస్తారని ఉత్తమ్ వెల్లడించారు. నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు తదితర అంశాల్లో టీఆర్ఎస్ మోదీ సర్కార్‌కు అండగా నిలిచిందని, టీఆర్ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేయడమేనన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి మోదీ ప్రజలను మోసం చేశారన్నారు. తాను ఎంపీ అయితే హైదరాబాద్ నుంచి సూర్యాపేట, కోదాడ మార్గంలో విజయవాడకు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైల్వే లైన్‌ను నిర్మించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలే తన కుటుంబమని, వారి కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానని ఉత్తమ్ తెలిపారు.  

More Telugu News