isro: భారత రక్షణ రంగంలో తిరుగులేని ఆయుధం 'ఎమిశాట్'... దీన్నుంచి తప్పించుకోవడం అసాధ్యం!

  • శత్రుదేశాల రాడార్లే దీని లక్ష్యం
  • ముద్దుపేరు 'రాడార్ కిల్లర్'
  • రూ.432 కోట్ల ఖర్చుతో రూపొందించిన డీఆర్డీవో

భారత రక్షణ రంగంలో ఇవాళ కీలక ముందడుగు పడింది. శత్రుదేశాలను నివ్వెరపరిచేలా భారత నిఘా వ్యవస్థలోకి తిరుగులేని ఆయుధం రంగప్రవేశం చేసింది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగకేంద్రం నుంచి ఇవాళ పీఎస్ఎల్వీ-సి45 ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఎమిశాట్ కూడా ఉంది. ఎమిశాట్ రక్షణ రంగానికి సంబంధించిన శాటిలైట్. దీని పని శత్రుదేశాల రాడార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఎక్కడున్నాయో తెలుసుకోవడమే.

సాధారణంగా, శత్రుదేశాల విమానాలు, క్షిపణులను పసిగట్టడంలో రాడార్లదే కీలకపాత్ర. ఒకవిధంగా సైన్యాలకు రాడార్లు గుండెకాయలాంటివి. అలాంటి రాడార్లనే ఎమిశాట్ లక్ష్యంగా చేసుకుని నిఘా వేస్తుంది. ప్రత్యర్థికి చెందిన రాడార్లు ఎక్కడెక్కడ ఉన్నాయో నిత్యం ఓ కన్నేసి ఉంచుతుంది. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రక్షణ దళాలతో పంచుకుంటుంది. తద్వారా యుద్ధ సమయాల్లో శత్రుదేశాల రాడార్లను, కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీసేందుకు మన సైన్యానికి వీలు కలుగుతుంది. రాడార్ల సాయం లేకుండా యుద్ధం చేయడం అంటే ఆత్మహత్యాసదృశం అని చెప్పాలి. ప్రత్యర్థులు ఎక్కడ ఉన్నారో కనిపెట్టే రాడార్లు లేకుండా ఏ దేశ సైన్యం అయినా ఏమీ చేయలేదు. సరిగ్గా ఆ పాయింట్ ను ఆధారంగా చేసుకుని డీఆర్డీవో ఎమిశాట్ కు రూపకల్పన చేసింది.

ప్రాజక్ట్ కౌటిల్య కింద అభివృద్ధి చేసిన ఈ ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మెజర్ మెంట్ శాటిలైట్ (ఎమిశాట్) కు రూ.432 కోట్ల వ్యయం అయింది. దీన్ని ఇజ్రాయెల్ దేశానికి చెందిన 'సరాల్' నిఘా ఉపగ్రహం స్ఫూర్తితో రూపొందించారు. ఇది 24×7 నిఘా వేసే ఉపగ్రహం కావడంతో దీన్నుంచి తప్పించుకోవడం శత్రుదేశాలకు అసాధ్యం. డీఆర్డీవో నిపుణులు దీనికి ముద్దుగా 'రాడార్ కిల్లర్' అని పేరుపెట్టారు.

More Telugu News