Telangana: ఒక్కొక్కరికి రూ.30 కోట్లు ఇస్తేనే టీఆర్ఎస్ లోకి వెళుతున్నారు: విజయశాంతి

  • డబ్బుకు లొంగి పార్టీలు మారుతున్నారు
  • ప్రజలే నిలదీయాలి
  • రాహుల్ వస్తేనే దేశం బాగుపడుతుంది

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం ప్రచార కమిటీ అధినేత విజయశాంతి పార్టీ ఫిరాయింపుదారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్కొక్కరికి రూ.30 కోట్లు ఇస్తేనే టీఆర్ఎస్ లోకి వెళుతున్నారని, అలాంటి వారిని తాము ఆపలేకపోతున్నామనడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ ను నమ్మిన ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే, అలాంటి నాయకులు డబ్బుకు దాసోహం అంటూ పార్టీ మారుతున్నారని విజయశాంతి మండిపడ్డారు. పార్టీ మారుతూ నాయకత్వం సరిగా లేదంటూ అపవాదు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లందరూ కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు నాయకత్వం బాగుందో? లేదో? గుర్తించలేదా అంటూ నిలదీశారు.

పార్టీలు మారేటప్పుడు ఏదో ఒక సాకు చెప్పాలి కాబట్టి నాయకత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అయినా, వచ్చిన వాళ్లందరినీ చేర్చుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ, కారుకు లోడు ఎక్కువైతే ప్రమాదం జరుగుతుందన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అంతేకాకుండా, దేశంలో మోదీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, రాహుల్ గాంధీ వస్తేనే దేశం బాగుపడుతుందని అన్నారు.

More Telugu News