RGV: ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అడ్డుకోవడంపై సుప్రీం కోర్టుకెళుతున్నాం: వర్మ

  • సినిమా చూడాలనుకుంటే చాలా మార్గాలున్నాయి
  • లీగల్ కావొచ్చు అన్ లీగల్ కావొచ్చు
  • ఈ సినిమా ఆంధ్రావాళ్లే ఎక్కువగా చూశారు

తెలుగు రాష్ట్రాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గత కొన్నాళ్లుగా చర్చనీయాంశంగా నిలుస్తోంది. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించినప్పటి నుంచి జరిగిన సంఘటనల సమాహారమే లక్ష్మీస్ ఎన్టీఆర్. అయితే ఈ సినిమాలో చంద్రబాబు పాత్రను ప్రతికూల ఛాయలతో చూపించారంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఏపీలో రిలీజ్ నిలిపివేశారు. తెలంగాణలో ఈ సినిమా విడుదలైంది. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, ఆంధ్రాలో రిలీజ్ ను ఆపేయడంపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్టు తెలిపారు. సోమవారం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేస్తున్నామని చెప్పారు. న్యాయవాదులు అందుబాటులో లేకపోవడంతో సోమవారం అత్యున్నత న్యాయస్థానానికి వెళుతున్నట్టు వర్మ వెల్లడించారు.

అంతేకాకుండా, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువమంది చూసుంటారని తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో తన చిత్రం రిలీజ్ కాకపోయినా అందుబాటులో ఉన్న కొన్ని మార్గాల ద్వారా చూసే వీలుందని అన్నారు. అది న్యాయబద్ధమైనా, న్యాయవిరుద్ధమైనా, ఒక ప్రాంతంలో రిలీజ్ ను ఆపేసినంత మాత్రాన సినిమా చూడలేరు అనుకుంటే భ్రమపడినట్టేనని వ్యాఖ్యానించారు. సినిమా చూడాలి అనుకోవాలే కానీ, టెక్నాలజీ కారణంగా నిమిషాల వ్యవధిలో సినిమా చూసే వీలుందని అన్నారు. అయితే, ఏపీలో అందరూ చూసేందుకని కావాలనే లీక్ చేస్తున్నారన్న ఆరోపణలను వర్మ తోసిపుచ్చారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎక్కువగా స్పందించడంలేదని తెలిపారు.

More Telugu News