India: ​మరో మిగ్ విమానం కుప్పకూలింది... పైలట్ సేఫ్!

  • రాజస్థాన్ లో ఘటన
  • బయల్దేరిన కాసేపటికే ప్రమాదం
  • ఈ నెలలో ఇది రెండో ప్రమాదం

మిగ్ విమానాలు ఎంత గొప్ప చరిత్ర కలిగినవైనా ఇప్పుడవి ఎగిరే శవపేటికలుగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొంతకాలంగా భారత వాయుసేనను అత్యంత తీవ్రంగా కలవరపరుస్తున్న అంశం మిగ్ విమానాలు తరచుగా కూలిపోతుండడమే. తాజాగా, రాజస్థాన్ లో మిగ్-27 యూపీజీ విమానం కుప్పకూలింది. జోథ్ పూర్ ఎయిర్ బేస్ నుంచి బయల్దేరిన కాసేపటికే రాడార్ పై విమానం ఆచూకీ గల్లంతైంది. జోథ్ పూర్ కు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరోహీ ప్రాంతంలో ఈ మిగ్ విమానం కూలిపోయినట్టు గుర్తించారు. ఈ ఘటనలో పైలట్ కు ఎలాంటి ప్రమాదం కలగకపోవడంతో వాయుసేన వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.

ఇదే నెలలో బికనీర్ ప్రాంతంలో మిగ్-21 విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. వ్యూహపరంగా మిగ్ విమానాలు ఇప్పటికీ భారత వాయుసేనలో కీలకంగా ఉన్నా, అవి తరచూ ప్రమాదాల బారిన పడుతుండడం భారత రక్షణ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. వాటిని స్క్వాడ్రన్ల నుంచి తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. గతంలో జరిగిన కొన్ని ప్రమాదాల్లో పైలట్లు మృతి చెందారు.

More Telugu News