Whatsapp: వాట్సాప్‌లో పదో తరగతి ప్రశ్నపత్రం.. కర్నూలు జిల్లాలో కలకలం

  • పరీక్ష ప్రారంభమైన అరగంటకే వాట్సాప్‌లో క్వశ్చన్ పేపర్ చక్కర్లు 
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యాశాఖాధికారులు
  • పరీక్ష కేంద్రంలోని సిబ్బందిపై అనుమానం

పదో తరగతి పరీక్ష ప్రారంభమైన అరగంటకే ప్రశ్నపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడంతో కర్నూలు జిల్లాలో కలకలం రేగింది. ప్రస్తుతం పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం సోషల్ పేపర్-2 పరీక్ష జరిగింది. ఈ ప్రశ్నపత్నం ఎలా బయటకు వచ్చిందో కానీ వాట్సాప్‌లో విపరీతంగా షేర్ అయింది. గుర్తించిన జిల్లా విద్యాశాఖాధికారులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తించిన సిబ్బందే ప్రశ్నప్రత్రాన్ని మొబైల్‌లో ఫొటో తీసి వాట్సాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి తహెరాసుల్తాన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ప్రశ్నపత్రం తొలుత ఏ నంబరు నుంచి షేర్ అయిందన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు.

More Telugu News