Telangana: కేసీఆర్.. బీజేపీకి 300 సీట్లు వస్తే రాజీనామా చేస్తావా?: తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ సవాల్

  • ఎమ్మెల్సీ ఫలితాలతో కేసీఆర్ కు భయం పట్టుకుంది
  • కేసీఆర్ ఒవైసీ కంటే పెద్ద ముస్లిం
  • కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తం చేయండి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు భయం పట్టుకుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. అహంకారంతో, అధికార మదంతో విర్రవీగే నాయకులకు నిన్నటి ఎల్బీస్టేడియం సభ అట్టర్‌ ఫ్లాప్ కావడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ నేతల్లో అంతర్మథనం ప్రారంభమైందని, రాబోయే ఎన్నికల్లో మోదీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

‘రెండు యాగాలు చేసిన మీరు(కేసీఆర్‌) హిందువా.. ఏ విధంగా హిందువో మీరు చెప్పాలి..వక్రబుద్ధితో నువ్వు చేసే యజ్ఞం.. యజ్ఞం కాదు.. ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ కంటే  పెద్ద ముస్లిం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు.

బీజేపీకి ఈసారి 300 సీట్లు వస్తాయని లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ఒకవేళ కేసీఆర్ చెప్పినట్లు 150 కాకుండా 300 సీట్లు వస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమా? అని తెలంగాణ ముఖ్యమంత్రికి సవాలు విసిరారు. నోటి దురుసు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు చీదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తం చేయాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడిస్తేనే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి సెక్రటేరియట్ కు వస్తారని లక్ష్మణ్ అన్నారు. ‘సారు-కారు-పదహారు కాదు.. బారు-బీరు-సర్కారు అన్న రీతిలో తెలంగాణ ప్రభుత్వ తీరు ఉంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శతకోటి లింగాల్లో బోడిలింగం కేసీఆర్ అని విమర్శించారు. సైనికులను అవమానించిన కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల 1న హైదరాబాద్ లో మోదీ సభ ఉంటుందని ప్రకటించారు.

More Telugu News