India: వారణాసిలో ప్రధాని మోదీపై పోటీకి దిగుతున్న బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్!

  • బీఎస్ఎఫ్ లో నాణ్యతలేని ఆహారంపై బహదూర్ వీడియో
  • వైరల్ గా మారడంతో విధుల నుంచి తప్పించిన బీఎస్ఎఫ్
  • భద్రతాబలగాల్లో అవినీతిని ఎత్తిచూపేందుకు పోటీ చేస్తున్నానని ప్రకటించిన బహదూర్

తమకు నాణ్యతలేని ఆహారం పెడుతున్నారని ఆరోపిస్తూ బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ ఓ వీడియోను గతంలో విడుదల చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారడంతో ఆయన్ను బీఎస్ఎఫ్ విధుల నుంచి తప్పించింది. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో పెండింగ్ లో ఉంది. తాజాగా లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీపై తాను పోటీకి దిగుతున్నట్లు తేజ్ బహదూర్ ప్రకటించారు. వారణాసి నుంచి మోదీపై పోటీ చేస్తానన్నారు.

ప్రధానిపై పోటీకి దిగుతానని చెప్పగానే పలు రాజకీయ పార్టీలు తనను సంప్రదించాయనీ, అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని తాను నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. వారణాసిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తేజ బహదూర్ మాట్లాడారు.

భద్రతాబలగాల్లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టేందుకు, మాట్లాడేందుకే తాను ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు తేజ్ బహదూర్ తెలిపారు.‘ఎన్నికల్లో గెలవడం, ఓడిపోవడం అన్నది ముఖ్యం కాదు. భద్రతాబలగాలు ముఖ్యంగా పారామిలిటరీ దళాల విషయంలో కేంద్రం వైఫల్యాలను ఎత్తి చూపేందుకు ఈ పోటీకి దిగుతున్నా. జవాన్ల పేరు చెప్పి ఓట్లు సంపాదించేందుకు మోదీ యత్నిస్తున్నారు.

కానీ ఆ జవాన్ల కోసం ప్రధాని చేసిందేమీ లేదు. పుల్వామా దాడిలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోతే కనీసం వారికి అమరుల హోదా కూడా ఇవ్వలేదు’ అని బహదూర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్ఎఫ్ జవాన్లకు అందిస్తున్న ఆహార నాణ్యతపై సోషల్ మీడియాలో బహదూర్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన్ను బీఎస్ఎఫ్ విధుల నుంచి తప్పించింది.

More Telugu News