anna canteens: 'అన్నక్యాంటీన్ల'లో ఆహార సరఫరాకు ఓ పూట బ్రేక్‌!

  • ఈరోజు రాత్రి మూతపడనున్న అన్ని క్యాంటీన్లు
  • సోమవారం అల్పాహారం సమయానికి రెడీ
  • నిర్వాహక సంస్థ అక్షయపాత్ర ఫౌండేషన్‌ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదల ఆకలి తీరుస్తున్న ‘అన్న క్యాంటీన్లు’ ఈరోజు రాత్రి మూతపడనున్నాయి. సంస్థాగతమైన కారణాలతో ఒక పూట అన్ని క్యాంటీన్లను మూసివేస్తున్నట్లు నిర్వాహక ‘అక్షయపాత్ర ఫౌండేషన్‌’ ప్రకటించింది. ఆర్థిక సంవత్సరాంతం కావడంతో బ్యాంకు చివరి రోజున లావాదేవీలు ముగించాల్సిన కారణంగా తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తిరిగి సోమవారం ఉదయం అల్పాహారం సమయానికి యథావిధిగా క్యాంటీన్లు తెరుచుకుంటాయని సంస్థ ప్రతినిధులు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75 నగరాలు, 35 పట్టణాల్లో తొలివిడతలో 205 క్యాంటీన్లను  రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీటి సంఖ్యను పెంచింది. ఈ క్యాంటీన్లలో ఐదు రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం వారంలో ఆరు రోజులు అందిస్తున్నారు. ఈ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అప్పగించగా, రోజూకు 2.5 లక్షల మందికి ప్రయోజనం కలుగుతోందని అంచనా.

More Telugu News