ప్రచారంలో వింతగా ప్రవర్తించిన వైసీపీ గూడురు అసెంబ్లీ అభ్యర్థి.. నడిరోడ్డుపై అరుపులు.. పరుగులు తీసిన జనం!

30-03-2019 Sat 08:20
  • గత ఎన్నికల్లో తిరుపతి నుంచి ఎంపీగా గెలుపు
  • నడిరోడ్డుపై జనాలను పట్టుకుని గుండెలు బాదుకుంటూ అరుపులు
  • ఆయన ప్రవర్తనపై ఒకటే చర్చ

గత ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన వైసీపీ నేత, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెలగపల్లి వరప్రసాద్.. అకస్మాత్తుగా వింతగా ప్రవర్తించడం సర్వత్ర చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికల్లో గూడురు అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆయన.. బుధవారం నిర్వహించిన ప్రచారంతో జనాలు బెంబేలెత్తి పరుగులు తీశారు.

గూడూరులోని దొమ్మలపాళ్యం వద్ద 27న ఉదయం ఏడు గంటలకు నడిరోడ్డుపై పెద్దగా కేకలు వేస్తూ ప్రచారం చేపట్టారు. ‘ఒక కోటీ ఇరవై రెండు లక్షలు.. హహ్హహ్హ.. ఒక కోటీ ఇరవై రెండు లక్షలు’ అని పెద్దగా అరుస్తుండడంతో ఏం జరుగుతోందో తెలియక జనాలు విస్తుపోయారు. రోడ్డున పోయే వారిని పట్టుకుని ఎంపీగా తానేం చేసిందీ చెబుతుండడంతో జనాలు అతడి బారినపడకుండా తప్పించుకున్నారు. ‘‘స్వామీ మమ్మల్ని వదిలిపెట్టండి’’ అని చెబుతున్నా పట్టించుకోకపోవడంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

తనకు ఎదురుపడిన వారితో గుండెలు బాదుకుంటూ ఇప్పటి వరకు ఎవరైనా నాలా చేశారా? అని ప్రశ్నించసాగారు. మొత్తంగా 40 పనులు చేయించానని, కోటీ ఇరవై రెండు లక్షలు ఇక్కడ ఇచ్చానని, గూడూరులో 40 లక్షలు ఇచ్చానని చెప్పుకొచ్చారు. అక్కడే ఉన్న విలేకరిని చూసి ఈ విషయాలు రాసుకోవాలని ప్రాధేయపడ్డారు. దీంతో అతడిని తప్పించుకున్న ఆ వ్యక్తి పరుగులు తీశాడు. అది చూసి.. నన్ను తట్టుకునే ధైర్యం లేక పారిపోతున్నాడు అని వరప్రసాద్ కామెంట్ చేశారు.  

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండడంతో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ఆయన ప్రవర్తనలో ఈ మార్పు ఎందుకు వచ్చిందని ఆరా తీస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన చాలా హుందాగా ప్రవర్తించారని గుర్తు చేసుకుంటున్నారు. మానసికంగా ఆయన కలత చెంది ఉంటారని కొందరు చెబుతుండగా, మద్యం మత్తులోనే అలా చేశారని మరికొందరు చెబుతున్నారు.