Tamil Nadu: తమిళనాడులో ఓటర్లకు డబ్బులు పంచేందుకు టోకెన్ల విధానం.. సంచలనంగా మారిన వీడియో!

  • థేని లోక్‌సభ స్థానం నుంచి పన్నీర్ సెల్వం తనయుడి పోటీ
  • ప్రచారంలో హారతి ఇచ్చేందుకు పెద్ద ఎత్తున మహిళల సమీకరణ
  • టోకెన్లు ఇచ్చి  డబ్బులు తీసుకున్న మహిళలు

ఎలక్షన్ కమిషన్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఓటర్లకు నగదు పంపిణీ మాత్రం ఆగడం లేదు. నేతల సభలు, రోడ్డు షోలకు జన సమీకరణ కోసం యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈ విషయంలో తమిళనాడులో ఇప్పుడు మరో కొత్త పద్ధతి తెరపైకి వచ్చింది. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ప్రచారం చేస్తే ఓ రేటు, నేతలు వచ్చినప్పుడు వారికి హారతి పడితే మరో రేటు ఫిక్స్ చేశారు.  

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రనాథ్ థేని లోక్‌సభ స్థానం నుంచి అన్నాడీఎంకే తరపున బరిలోకి దిగారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని ఓ ప్రాంతానికి వచ్చిన ఆయనకు మహిళలు పెద్ద ఎత్తున హారతులతో స్వాగతం పలికారు. హారతి ఇచ్చేందుకు తీసుకొచ్చిన మహిళలకు రూ.200 చొప్పున ఇస్తామని ముందుగానే హామీ ఇచ్చారు. ఇందుకోసం ఎటువంటి పొరపాట్లు జరగకుండా హారతి ఇచ్చే మహిళలకు ముందుగానే టోకెన్ల వంటివి పంపిణీ చేశారు. కార్యక్రమం ముగిశాక.. ఆ టోకెన్లు, హారతి పళ్లాలు ఇచ్చి మహిళలు రూ.200 తీసుకోవడాన్ని కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

More Telugu News