Telugudesam: ఇంటెలిజెన్స్ చీఫ్ లేనంత మాత్రాన చంద్రబాబు ప్రాణాలు పోతాయా?: వాసిరెడ్డి పద్మ విమర్శలు

  • సీఎం సహా, టీడీపీ నేతలు ఇలా మాట్లాడటం విడ్డూరం
  • బాబు ఇలా మాట్లాడటం అతిపెద్ద రాజ్యాంగ సంక్షోభం
  • ఏపీలో రాష్ట్రపతిపాలన పెట్టొచ్చు కదా!

ఇంటెలిజెన్స్ చీఫ్ లేనంత మాత్రాన  చంద్రబాబు ప్రాణాలు పోతాయా? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఈరోజు మీడియాతో ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడటం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం, భావోద్వేగాలను రెచ్చగొట్టడం వంటి పనులకు పాల్పడుతోందని విమర్శించారు. తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సాక్షాత్తూ ముఖ్యమంత్రి సహా, టీడీపీ నేతలు మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని అన్నారు.

 ‘ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ లేకపోతే మీ(చంద్రబాబు) ప్రాణాలు పోతాయా? అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా? మీ ప్రాణాలు పోయే పరిస్థితే ఉంటే ఆ స్థానంలో ఇక మీరేందుకు? రాష్ట్రపతిపాలన పెట్టొచ్చు కదా?’ అని ఆమె ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ లేకపోతేనే చంద్రబాబు ఇలా మాట్లాడటం, ‘ఇది అతిపెద్ద రాజ్యాంగ సంక్షోభం కాదా? ఇలాంటి పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టి మీరు ఏం చేయదలచుకున్నారు? మీరు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అర్హులేనా?’ అనే పలు ప్రశ్నలు ప్రజల ముందు ఉన్నాయని అన్నారు. ఎన్నికల్లో అక్రమంగా గెలిచి అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబుకు ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఓ గుణపాఠం అని అన్నారు.

More Telugu News