KCR: తెలంగాణ దాటితే కేసీఆర్‌ను పలకరించే దిక్కు లేదు: భట్టి

  • ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు
  • ఎంఐఎం తన విధానమేంటో చెప్పాలి
  • మోదీని ప్రధానిని చేసేందుకు శ్రమిస్తున్నారు

మోదీని తిరిగి ప్రధానిని చేసేందుకు కేసీఆర్ శ్రమిస్తున్నారని సీఎల్పీ నేత, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గాంధీభవన్‌లో నేడు భట్టి అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీకి బీ టీమ్‌గా ఉన్న కేసీఆర్‌కు మద్దతిస్తున్న ఎంఐఎం తన విధానమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పరిధి దాటితే కేసీఆర్‌ను పలకరించేవారే లేరని ఎద్దేవా చేశారు.

అలాంటి కేసీఆర్ 16 సీట్లు టీఆర్ఎస్‌కు కట్టబెడితే ఫెడరల్ ఫ్రంట్ ద్వారా దేశానికి దశ, దిశా నిర్దేశం చేస్తానని చెబుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలను భట్టి కోరారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి విజయం టీఆర్ఎస్ పతనానికి నాంది అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, గండ్ర వెంకటరమణారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Telugu News