యువత ఉద్యోగాలు లేక అల్లాడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?: వైఎస్ జగన్

- అమరేశ్వర స్వామి భూములను కూడా కొట్టేశారు
- రాజధాని పేరుతో సినిమాలు చూపిస్తున్నారు
- సంతనూతలపాడు సభలో నిప్పులు చెరిగిన జగన్
సంతనూతలపాడులో ప్రజలు తాగు, సాగు నీరు లేక ఇబ్బందిపడుతున్నారని జగన్ తెలిపారు. నాగార్జున సాగర్ నుంచి కనీసం నీరు ఇప్పించుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ‘ఈ ఐదేళ్లలో పొగాకు రైతులు పెట్టుబడులు రాక, బతుకు కష్టమై ఆత్మహత్యలు చేసుకున్నారు. రమణారెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. పరిహారం కోసం పోరాటం చేస్తే కేసులు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిది.
జగన్ అనే వ్యక్తి వచ్చి పోరాటం చేస్తే తప్ప పొగాకుకు కనీస పెట్టుబడి ధర పెరగలేదు. కంది రైతులకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సుబాబుల్ కనీస ధర రూ.4,000 పలికితే నేడు కనీసం రూ.2,500 కూడా రావడంలేదు. శనగ రైతులకు కూడా కనీస ధర లేకుండా పోయింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఒక్కరోజు కూడా రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు’ అని విమర్శించారు.
ఈ సందర్భంగా చీమకుర్తిలో తన ప్రజాసంకల్ప యాత్రను జగన్ గుర్తుచేసుకున్నారు. ‘చీమకుర్తిలో క్వారీలు, పాలిషింగ్ యూనిట్లు మూతపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగైదు వందల పాలిషింగ్ యూనిట్లు మూతపడిన పరిస్థితి నెలకొంది. పరిస్థితులు ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం 20లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి.. 40లక్షల ఉద్యోగాలు వచ్చాయని గొప్పలు చెబుతున్నారు. ఉద్యోగాలు దొరక్క యువత బాధపడుతుంటే.. పరిశ్రమలు మూతపడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?’ అని ప్రశ్నించారు.