Andhra Pradesh: వెనక్కి తగ్గేదే లేదు.. హైకోర్టు తీర్పుపై అవసరమైతే సుప్రీంకోర్టుకు పోతాం!: టీడీపీ నేత రాజేంద్రప్రసాద్

  • గోపాలకృష్ణ ద్వివేది అసమంజసంగా మాట్లాడారు
  • వైసీపీ సిట్టింగ్ ప్రెసిడెంట్ విజయమ్మ, స్టాండింగ్ ప్రెసిడెంట్ షర్మిల ప్రచారంలోకి దిగడాన్ని స్వాగతిస్తున్నాం
  • విజయవాడలో మీడియాతో టీడీపీ నేత

కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు సరైనవే అని ఏపీ హైకోర్టు ఎక్కడా చెప్పలేదని టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ తప్పు అని కూడా న్యాయస్థానం ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోమని మాత్రమే కోర్టు చెప్పిందన్నారు. న్యాయస్థానం ఈరోజు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబుతో చర్చించి అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా పోతామని వ్యాఖ్యానించారు.

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి  గోపాలకృష్ణ ద్వివేది చాలా అసమంజసంగా మాట్లాడారని రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. అధికారులను బదిలీ చేయడం శిక్ష కాదనీ, ఎలాంటి విచారణ చేపట్టకుండా ఈసీ చర్యలు తీసుకోవచ్చని ద్వివేది చెప్పారన్నారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడారు.

ఈ విషయంలో ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఈ మాటలతో తేలిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి వైఖరిని తాము సహించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే మోదీ సీబీఐ, ఈడీ, ఐటీ, న్యాయవ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. అదే తరహాలో ఈరోజు ఎన్నికల సంఘాన్ని మోదీ ప్రభావితం చేస్తున్నారన్న అనుమానం తమకు వస్తోందని  తెలిపారు. ఈసీ కొత్తగా నిర్వచనాలు ఇస్తూ అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సిట్టింగ్ ప్రెసిడెంట్ విజయమ్మ గారూ, స్టాండింగ్ ప్రెసిడెంట్ షర్మిల గారూ, వాకింగ్ ప్రెసిడెంట్ జగన్ ప్రచారం మొదలుపెట్టడం సంతోషకరమైన పరిణామమని సెటైర్ వేశారు.

జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని విజయమ్మ కోరడంపై రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ.. ‘అసలు ఏం చూసి జగన్ కు అవకాశం ఇవ్వాలి? ఆయనపై ఉన్న 31 అవినీతి కేసులను చూశా? లేక హత్యా ఆరోపణలను చూసి అవకాశం ఇవ్వాలా? లేక ఆయన నియంత వైఖరిని చూసి ఓటేయాలా? ఏది చూసి జగన్ కు ఓటేయాలి. మీ అబ్బాయి రాష్ట్ర ప్రజలకు ఏం చేశాడు. 12 సీబీఐ కేసుల్లో ఇరుక్కుని రూ.56,000 కోట్లు తినేశాడన్న ఆరోపణలున్న వ్యక్తికి అవకాశం ఎలా ఇవ్వమంటారు? దాదాపు రూ.25,000 కోట్లు ఈడీ జప్తు చేసిన వ్యక్తి అవకాశం ఎలా ఇవ్వమంటారు. సొంత చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో ముద్దాయిగా పేరు వినబడుతున్న జగన్ కు అవకాశం ఎలా ఇవ్వమంటారు?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.

ఓ తల్లిగా జగన్ పై విజయమ్మకు వాత్సల్యం ఉండొచ్చనీ, కానీ ఏపీ ప్రజల సొమ్మును జగన్ దిగమింగాడని విమర్శించారు. జగన్ హత్యారాజకీయాలకు,  అవినీతి రాజకీయాలకు పాల్పడ్డాడని దుయ్యబట్టారు. చివరికి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ ముద్దాయిగా ఉన్నాడని ఆరోపించారు. జగన్, విజయమ్మ, షర్మిల ఏపీ అంతటా పొర్లు దండాలు పెట్టినా, తలక్రిందులుగా తపస్సు చేసినా ఏపీ ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అయితే అవినీతికి జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు.

More Telugu News