జగన్ ఏదైనా అనుకుంటే చేస్తాడు.. ఏదైనా అనుకుంటే సాధిస్తాడు!: వైఎస్ విజయమ్మ

Fri, Mar 29, 2019, 12:30 PM
  • ఈ ఎన్నికల్లో విలువలు, విశ్వసనీయతకు ఓటేయండి
  • వైఎస్ చనిపోయాక జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టారు
  • కందుకూరు బహిరంగ సభలో వైఎస్ విజయమ్మ ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోందని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. ఏపీ ప్రతిపక్ష నేత, తన కుమారుడు జగన్ ను అక్కున చేర్చుకున్న ప్రతీఒక్కరికి ఆమె ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. విలువలకు, విశ్వసనీయతకు ఓటేయాలని ప్రజలను కోరారు. వైఎస్సార్ స్ఫూర్తి, ఆశయాలతో వైసీపీ పుట్టిందని విజయమ్మ అన్నారు. వైఎస్ కుటుంబానికి, ప్రజలకు మధ్య 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.

వైసీపీకి ఓటు పడకుండా చేసేందుకు కొందరు వ్యక్తులు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని విజయమ్మ విమర్శించారు. ప్రజలు జాగ్రత్తగా గమనించి వైసీపీకి చెందిన ఫ్యాను గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ లా జగన్ నిత్యం ప్రజలతోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో వైసీపీ అధికారానికి దూరమయిందని విజయమ్మ అన్నారు.  ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలన్నారు. తన కుటుంబం కంటే ఏపీ ప్రజలకే ఎక్కువ కష్టాలు ఉన్నాయని చెప్పారు.

‘కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం రాజశేఖరరెడ్డి మంచోడు. జగన్ బాబు మంచోడు. బయటకు రాగానే కేసులు పెట్టారు. అరెస్ట్ చేశారు. ఓదార్పుయాత్ర చేస్తానని ఆరోజు జగన్ మాటిచ్చాడు. ప్రజలే మా కుటుంబం అనుకున్నాడు. ప్రజల్లోనే ఉన్నాడు. ఈ 9 సంవత్సరాల్లో నాతో ఎప్పుడూ గడిపింది లేదు. నెలకు మూడు వారాలు మీతోనే గడిపాడు. ఈరోజు మీకు ఓ విషయం చెబుతున్నా. జగన్ ఏదైనా అనుకుంటే చేస్తాడు. జగన్ ఏదైనా అనుకుంటే సాధిస్తాడు. రాజారెడ్డిని అప్పట్లో హత్యచేసిన వారికి ఎవరు సాయం చేశారో మనందరం చూశాం. 9 సంవత్సరాల క్రితం నా భర్త రాజశేఖరరెడ్డిని పోగొట్టుకున్నా. అది అనుమానాస్పద మరణంగా మారింది.

నాలుగు నెలల క్రితం వైజాగ్ ఎయిర్ పోర్టులో జగన్ బాబును చంపేందుకు ప్రయత్నించారు. గుండు సూదులు కూడా పోని ఎయిర్ పోర్టులో కత్తులు ఎలా పోయాయని అడుగుతున్నా. దీనికి ఎంక్వైరీ లేదు. మొన్నటికిమొన్న వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా చంపారు. ఈ నలుగురూ ప్రజలు బాగుండాలని కోరుకున్నవాళ్లు. మా కుటుంబంపై ఇంత పగ ఎందుకో ఆ దేవుడికే తెలియాలి’ అని విజయమ్మ వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాద బలమే జగన్ ను ముందుకు నడిపిస్తోందని ఆమె అన్నారు. తన భర్తను పోగొట్టుకున్న సమయంలో 16 నెలలు తన కుమారుడు జగన్ ను జైలులో పెట్టి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement