Bengalore: క్వశ్చన్ పేపర్ లో ఈ ప్రశ్నను చూస్తే అవాక్కే... పేపర్ తయారుచేసిన టీచర్ ఉద్యోగం ఊడింది!

  • రైతులకు మిత్రులెవరని ప్రశ్న
  • ఆప్షన్స్ లో కుమారస్వామి, యడ్యూరప్ప
  • వివరణ ఇచ్చుకున్న బెంగళూరు పాఠశాల

రైతులకు మిత్రులు ఎవరు? ఈ ప్రశ్న టెన్త్ లోపు విద్యార్థులకు ఎన్నోమార్లు ఎదురవుతుంది. ఇప్పుడు ఇదే ప్రశ్నకు జవాబుగా ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ప్రశ్నాపత్రాన్ని కాస్తంత కొత్తగా తయారు చేద్దామని భావించాడో ఏమో... ఓ టీచర్ చేసిన పనికి, అతని ఉద్యోగమే ఊడిపోయింది. మరిన్ని వివరాల్లోకి వెళితే...

బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ లో ఉన్న మౌంట్ కార్మెల్ హైస్కూల్ లో ఎనిమిదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో విద్యార్థులను అడిగిన ఓ ప్రశ్న రైతులకు మిత్రులు ఎవరు? అంతవరకూ బాగానే ఉంది. దానికి ఆప్షన్స్ గా ఏ. కుమారస్వామి, బీ. వానపాములు, సీ. యడ్యూరప్ప అని ఇవ్వడమే ఉపాధ్యాయుడి కొంపముంచింది. విద్యార్థులు సరిగ్గానే 'వానపాములు' అన్న ఆప్షన్ ను ఎంచుకోగా, ఈ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీంతో స్కూల్ యాజమాన్యం సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీచర్ ను ఉద్యోగం నుంచి తీసేశామని ప్రకటించింది. తాము ఏ రాజకీయ పార్టీకీ మద్దతు ఇవ్వడం లేదని వివరించింది.




More Telugu News