USA: అమెరికాలో ఉన్మాది వీరంగం.. ఇద్దరు వాహనదారుల కాల్చివేత.. పలువురికి తీవ్రగాయాలు!

  • ఇద్దరు అమెరికన్ల పరిస్థితి విషమం
  • ఈశాన్య సియాటెల్ లో ఘటన
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

అగ్రరాజ్యం అమెరికా మరోసారి నెత్తురోడింది. సియాటెల్ పట్టణంలో ఓ ఉన్మాది తుపాకీతో కాల్పులు జరుపుతూ వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈశాన్య సియాటెల్ ప్రాంతంలో ఉంటున్న ఓ దుండగుడు స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తుపాకీతో హల్ చల్ చేశాడు. తొలుత కారును నిలువరించి అందులోని మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె ప్రతిఘటించడంతో కాల్పులు జరిపాడు. దీంతో ఆ మహిళ అక్కడే కుప్పకూలిపోయింది.

ఈ నేపథ్యంలో అక్కడకు పోలీసులు చేరుకోవడంతో అటుగా వెళుతున్న బస్సుపై కాల్పులు జరిపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ సందర్భంగా శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోయినప్పటికీ చాకచక్యంగా బస్సును ఆపకుండా ముందుకు తీసుకెళ్లిపోయాడు. డ్రైవర్ తో పాటు గాయపడ్డ మహిళను అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

అక్కడితో ఆగకుండా అటుగా వెళుతున్న కారుపై కూడా ఉన్మాది కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కారును నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం కారును వేగంగా తీసుకెళ్లిన దుండగుడు.. ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు. దీంతో అందులోని వ్యక్తి ప్రాణాలు వదిలాడు. చివరికి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. అయితే ఈ కాల్పులు ఎందుకు జరిపారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

More Telugu News