Viva Supermarkets: ఇది కదా రికార్డు అంటే.. ఏడు బంతుల్లో ఏడు సిక్సర్లు!

  • రికార్డులకెక్కిన ముంబై కుర్రాడు
  • ఎదుర్కొన్న ఏడు బంతులను సిక్సర్లుగా మలిచిన వైనం
  • 26 బంతుల్లో ఏకంగా 84 పరుగులు

క్రికెట్‌లో రికార్డులకు కొదవలేదు. నిత్యం ఏదో ఒక రికార్డు నమోదవుతూనే ఉంటుంది. అయితే, అసాధ్యమనుకున్న రికార్డులను కూడా అలవోకగా బద్దలుగొట్టడం ఇప్పుడు కనిపిస్తోంది. ఆటలో వేగం పెరిగాక పాత రికార్డులు బద్దలవుతుండడంతోపాటు కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా, ముంబైకి చెందిన 23 ఏళ్ల కుర్రాడు మకరంద్ పాటిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరుస బంతుల్లో ఏడు సిక్సర్లు కొట్టి అదరహో అనిపించాడు.

ముంబైలోని సచిన్ టెండూల్కర్ జింఖానా గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాటిల్ ఈ రికార్డు సృష్టించాడు. వివా సూపర్ మార్కెట్స్-మహింద్ర లాజిస్టిక్స్ మధ్య జరిగిన టోర్నమెంటులో వివాసూపర్ మార్కెట్స్‌ తరపున బరిలోకి దిగిన మకరంద్ పాటిల్ వీర విహారం చేశాడు. ఎనిమిదో నంబరు బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన పాటిల్ బౌలర్లను ఊచకోత కోశాడు.

26 బంతుల్లో ఏకంగా 84 పరుగులు చేశాడు. ఓ ఓవర్లో వరుసగా ఆరు బంతులను స్టాండ్స్‌లోకి పంపిన మకరంద్.. ఆ తర్వాతి ఓవర్‌లో తానెదుర్కొన్న తొలి బంతిని సిక్సర్‌గా మలిచి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఎదుర్కొన్న ఏడు బంతులను సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించినందుకు ఆనందంగా ఉన్నా.. మరోసారి ఇది సాధ్యమవుతుందని అనుకోవడం లేదని మకరంద్ పేర్కొన్నాడు.

More Telugu News