TRS: పోటీలోనే ఉంటాం.. ఉపసంహరించుకునేది లేదు!: స్పష్టం చేసిన నిజామాబాద్ రైతులు

  • కవితపై పోటీ చేస్తున్న 180 మంది రైతులు
  • నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్న టీఆర్ఎస్
  • నామినేషన్ల ఉపసంహరణకు నేటితో ఆఖరు

సార్వత్రిక ఎన్నికల వేళ ఇప్పుడు దేశం దృష్టి నిజామాబాద్‌పై పడింది. ఇక్కడి నుంచి బరిలో ఉన్న టీఆర్ఎస్ మహిళా నేత కల్వకుంట్ల కవితపై 180 మందికిపైగా రైతులు పోటీ చేయడమే ఇందుకు కారణం. తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కవిత ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదని ఆరోపిస్తూ పసుపు, ఎర్రజొన్న రైతులు ఆమెపై బరిలోకి దిగారు. దీంతో ఓట్లు చీలిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ వారితో నామినేషన్లు ఉపసంహరింపజేయాలని ప్రయత్నించింది. సమస్యలు పరిష్కరిస్తామంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది.

అయితే, రైతులు మాత్రం ససేమిరా అంటున్నారు. వెనక్కి తగ్గేది లేదని, బరిలోనే ఉంటామని తెగేసి చెబుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో పూర్తి కానుండగా ఒక్క రైతు కూడా ముందుకు రాకపోవడంతో టీఆర్ఎస్ నేతలను కలవరపరుస్తోంది. ఈ స్థానం నుంచి మొత్తం 203 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన అనంతరం 189 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, పిరమిడ్‌, బహుజన ముక్తి, సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ బ్లాక్‌తో పాటు మరో ఇద్దరు స్వతంత్రులు ఉండగా, మిగతా వారంతా రైతులే కావడం గమనార్హం.

More Telugu News