'బిచ్చగాడు' హీరో ఆశలన్నీ 'కిల్లర్' పైనే

27-03-2019 Wed 16:11
  • 'బిచ్చగాడు'తో మంచి క్రేజ్ 
  • 'కిల్లర్'తో మరో ప్రయత్నం 
  • కీలకమైన పాత్రలో అర్జున్    
తెలుగులో ఈ మధ్యకాలంలో వచ్చిన అనువాద చిత్రాలేవీ అంతగా ఆదరణ పొందలేదు. అనువాద చిత్రాలు థియేటర్లకు వచ్చి వెళుతున్న విషయాలు కూడా చాలామందికి తెలియడం లేదు. ఈ నేపథ్యంలో విజయ్ ఆంటోని తాను హీరోగా చేసిన మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

తమిళంలో 'కొలైగారన్' పేరుతో ఆయన చేసిన సినిమాను, తెలుగు ప్రేక్షకుల ముందుకు 'కిల్లర్' టైటిల్ తో తీసుకురానున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ సీడీని రిలీజ్ చేశారు. ఆండ్ర్యూ లూయిస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అషిమా నర్వాల్ కథానాయికగా నటించింది. మే నెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'బిచ్చగాడు'తో తెలుగులో పాప్యులర్ అయిన విజయ్ ఆంటోనికి, ఆ తరువాత ఆ స్థాయి హిట్ పడలేదు. 'కిల్లర్' సినిమా ఆయన మార్కెట్ ను మళ్లీ పెంచుతుందేమో చూడాలి.