Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తోంది.. 20 మంది హ్యాకర్లను నియమించుకుంది!: హైకోర్టులో వైసీపీ పిటిషన్

  • ఇంటెలిజెన్స్ అధికారులు మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు
  • ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు
  • వెంకటేశ్వరరావు విదేశాలకు వెళ్లి టెక్నాలజీ తెచ్చారు

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ ప్రతిపక్ష వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 13 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని సజ్జల పిటిషన్ లో తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా 20 మంది హ్యాకర్లను నియమించుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు.

ఈ పిటిషన్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ప్రతివాదులుగా చేర్చినట్లు సజ్జల తెలిపారు. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు విదేశాలకు వెళ్లి మరీ ట్యాపింగ్ టెక్నాలజీని తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాల్సిందిగా హైకోర్టును కోరినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్‌ వేటు వేసిన ముగ్గురు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్‌ చేయడాన్ని తప్పుపడుతూ చంద్రబాబు ఏడు పేజీల లేఖ రాశారు.

More Telugu News