kutumbarao: చంద్రబాబుపై దాడి చేయాలనుకుంటున్నారు.. ఏదైనా జరిగితే కేంద్రానిదే బాధ్యత: కుటుంబరావు

  • సీఎం భద్రతను చూసే వ్యక్తిని ఎలా బదిలీ చేస్తారు?
  • ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేయడం చట్ట విరుద్ధం
  • వివేకా హత్య కేసులో నిజాలు బయటపడతాయనే ఎస్పీని బదిలీ చేయించారు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై దాడి చేసేందుకే ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేయించారని ఏపీ ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ కుటుంబరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి భద్రతను చూసే వ్యక్తిని ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే ప్రత్యామ్నాయ నేత జగనేనని... అప్పుడు వైసీపీకి ఓట్లు పడతాయనేది ఆ పార్టీ వ్యూహంలా ఉందని ఆరోపించారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే దానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. ఎన్నికల విధులతో సంబంధం లేని ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఈ నిబంధన లేదని చెప్పారు. దీనిపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశామని తెలిపారు.

ఫామ్-7పై తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఈసీ ఈరోజు వరకు ఎందుకు చర్యలు చేపట్టలేదని కుటుంబరావు ప్రశ్నించారు. వివేకా హత్య కేసు ఆయన సన్నిహితులు, మిత్రుల చుట్టే తిరుగుతోందని చెప్పారు. నిజాలు బయటపడతాయనే భయంతోనే కడప ఎస్పీని బదిలీ చేయించారని మండిపడ్డారు.

More Telugu News