ys: వైయస్ సునీత ఆ రోజు ఏం మాట్లాడారు? ఈ రోజు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు?: సీఎం రమేష్

  • కడప ఎస్పీని బదిలీ చేస్తే వివేకా హత్య కేసు విచారణ ఎలా కొనసాగుతుంది?
  • ఈసీని వైసీపీ, బీజేపీ నేతలు కలిసిన వెంటనే బదిలీ ఆర్డర్లు వచ్చాయి
  • ఇంటెలిజెన్స్ అధికారిని ఈసీ బదిలీ చేయడం ఇదే ప్రథమం

కడప జిల్లా ఎస్పీని హఠాత్తుగా బదిలీ చేస్తే, వైయస్ వివేకా హత్య కేసు విచారణ ఎలా కొనసాగుతుందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ప్రశ్నించారు. హత్య కేసులో వైసీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయి కాబట్టే ఆయనను బదిలీ చేశారని చెప్పారు. హత్య గురించి వివేకా కుమార్తె సునీత తొలిరోజు మీడియాతో మాట్లాడుతూ, విచారణ నిష్పక్షపాతంగా సాగాలని, రాజకీయ నేతలు ఎవరూ దీనిపై మాట్లాడకూడదని అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆమెతో ఢిల్లీ, హైదరాబాదులో ఏ విధంగా మాట్లాడించారు? ఈరోజు కూడా ఆమెతో ఎలా మాట్లాడిస్తున్నారు? అనే విషయాన్ని అందరూ గమనించాలని అన్నారు. తొలి రోజు ఏం మాట్లాడారు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారనే విషయాన్ని గుర్తించాలని కోరారు.

వైసీపీ ఎంపీలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కలిసిన ఐదు నిమిషాల వ్యవధిలో బీజేపీ నేతలు కూడా కలిశారని... ఆ తర్వాత 10 నిమిషాలకే ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్టు ఆర్డర్స్ వచ్చాయని సీఎం రమేష్ చెప్పారు. ఇప్పటి వరకు వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ మాత్రమే కుమ్మక్కయ్యాయని అనుకున్నామని... వీరితో ఈసీ కూడా కలిసిపోయిందనే విషయం ఇప్పుడు అర్థమవుతోందని విమర్శించారు.

ఎలక్షన్ కమిషన్ ను కలిసి, న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. లా అండ్ ఆర్డర్ కు సంబంధించిన అధికారులపై ఫిర్యాదులు వస్తే, విచారణ అనంతరం బదిలీ చేస్తుంటారని... ఇక్కడ విచారణ జరపకుండానే బదిలీ చేశారని మండిపడ్డారు. కడప ఎస్పీపై ఇప్పటి వరకు ఒక్క చిన్న ఫిర్యాదు కూడా లేదని చెప్పారు. ముఖ్యమంత్రి రక్షణను చూసుకునే ఇంటెలిజెన్స్ అధికారిని కూడా బదిలీ చేశారని దుయ్యబట్టారు. ఇంటెలిజెన్స్ అధికారులను ఈసీ బదిలీ చేయడం ఇదే ప్రథమం అని అన్నారు.

More Telugu News