jagan: జగన్, విజయసాయిరెడ్డి బెయిలు రద్దు చేయాలని లేఖ రాస్తున్నా: బుద్ధా వెంకన్న

  • అధికారంలోకి రాకముందే అరాచకాలకు పాల్పడుతున్నారు
  • జగన్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
  • వివేకా కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారు

అధికారంలోకి రాకముందే వైసీపీ నేతలు అరాచకాలకు తెగబడుతున్నారని, వారు అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మొత్తాన్ని కబ్జా చేస్తారని ఓటర్లు భయపడుతున్నారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడించినట్టు ఆడుతున్న జగన్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఏప్రిల్ 11వ తేదీ ఎప్పుడు వస్తుంది? మోదీ, కేసీఆర్, జగన్ లకు ఎప్పుడు బుద్ధి చెబుదాం? అంటూ ప్రజలంతా వేచి చూస్తున్నారని అన్నారు.

కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డికి ఆసుపత్రి ఉందనే విషయం ఇంత వరకు మీకు తెలియదా? టీడీపీలో చేరిన రోజుల వ్యవధిలోనే ఆయనపై ఐటీ దాడులు చేయిస్తారా? అని బుద్ధా మండిపడ్డారు. ఈ దాడులు ఇంతకు ముందే చేసి ఉండవచ్చు కదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న కుట్రలన్నీ ప్రజలకు స్పష్టంగా తెలుస్తున్నాయని చెప్పారు. ప్రస్తుత వైసీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఆయనపై ఐటీ దాడులు జరిగాయని... ఆ సోదాల్లో ఏం దొరికిందో దమ్ముంటే ఇప్పుడు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇంత అరాచకాన్ని రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడలేదని అన్నారు.

ఆస్తులు కాపాడుకోవడానికి కేసీఆర్ తో, కేసుల నుంచి బయటపడటానికి మోదీతో లాలూచీ పడి జగన్ నీచ రాజకీయాలకు ఒడిగడుతున్నారని బుద్ధా విమర్శించారు. వైసీపీ గెలవదనే విషయం జగన్ కు తెలుసని చెప్పారు. సీఎం కాదుకదా, కనీసం ప్రతిపక్ష నేతగా కూడా ఉండబోననే విషయం జగన్ కు తెలుసని అన్నారు. సందుల్లో, గొందుల్లో మాట్లాడుతూ, జనాలను మేడలపైకి ఎక్కించి, గ్రాఫిక్స్ ద్వారా సభలకు జనాలు వచ్చినట్టు చూపించుకుంటున్నారని... చంద్రబాబు రోడ్ షోలకు జనాలు ప్రభంజనంలా వస్తుండటాన్ని మీరు చూస్తున్నారా? అని ఎద్దేవా చేశారు.

జగన్ ఎలాంటి నీచానికైనా దిగజారుతారనే విషయం అందరికీ అర్థమయిందని బుద్దా చెప్పారు. సొంత బాబాయ్ వివేకా కుటుంబసభ్యులను కూడా బెదిరించి, మీడియా ముందు వారితో అసత్యాలను పలికిస్తున్నారని మండిపడ్డారు. 12 కేసుల్లో ఏ1, ఏ2గా ఉన్న జగన్, విజయసాయిరెడ్డిలు అరాచకాలకు పాల్పడుతున్నారని... వారికి బెయిల్ ను వెంచనే రద్దు చేయాలని కోర్టుకు, ఈసీకి లేఖ రాస్తున్నానని చెప్పారు. బెయిల్ పై వీరు బయట ఉంటే పోలింగ్ జరిగే లోపల మరెన్నో అరాచకాలు జరుగుతాయని అన్నారు. చివరకు పోలీసులను కూడా బెదిరించే స్థాయికి వీరు వచ్చారని మండిపడ్డారు. పోలీసులు నిస్సహాయులు అయితే... ప్రజలను ఎవరు కాపాడతారని ప్రశ్నించారు.

More Telugu News