Crime News: పనిమనిషిపై అత్యాచారం కేసులో పదేళ్ల జైలు...సహకరించిన భార్యకు జరిమానా

  • పనిమనిషిపై యజమాని దారుణం
  • స్నానం చేస్తుండగా దొంగచాటుగా చిత్రీకరణ
  • బెదిరించి, బ్లాక్‌మెయిల్‌ చేసి లైంగిక దాడి

బాత్‌రూంలో రహస్య కెమెరాలతో స్నానం దృశ్యాలు చిత్రీకరించి, అనంతరం బెదిరించి పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. భర్త తప్పుచేస్తుంటే వారించాల్సింది పోయి, అతనికి సహకరించిన భార్యకు కూడా రూ.15 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పన్నెండేళ్ల క్రితం జరిగిన ఈ దారుణంపై హైదరాబాద్‌లోని ఏఎంఎస్‌జే కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు...బంజారాహిల్స్‌ మిథిలానగర్‌లో వహీద్‌ఖాన్‌ (53), అతని భార్య నివాసం ఉంటున్నారు. గుంటూరు జిల్లా నల్లచెరువు ప్రాంతానికి చెందిన ఓ యువతి 2006లో వీరింట్లో పనిమనిషిగా చేరింది. ఇంట్లోనే ఉండి ఇంటి పనులు చూసుకునేది. ఆమెపై కన్నేసిన వహీద్‌ఖాన్‌ బాత్‌రూంలో రహస్యంగా కెమెరా ఏర్పాటుచేసి స్నానం చేస్తుండగా చిత్రీకరించాడు.

ఓ రోజు కడుపులో నొప్పిగా ఉందని ఆమె చెప్పగా వహీద్‌ఖాన్‌ భార్య మాత్రలు ఇచ్చింది. అవి వేసుకుని నిద్రలోకి జారుకున్నాక వహీద్‌ పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మేల్కొన్న తరువాత తనున్న పరిస్థితి చూసి యజమానురాలిని పనిమనిషి ప్రశ్నించగా సర్దిచెప్పింది. మరుసటి రోజు కూడా అలాగే జరగడంతో అనుమానించిన ఆ యువతి వహీద్‌ఖాన్‌ దంపతులను నిలదీసింది.

దీంతో ఖాన్‌ ఆమెకు బాత్‌రూంలో స్నానం చేస్తున్న దృశ్యాలు చూపించి బెదిరించాడు. ఆ యువతి భయపడడంతో అదే అదనుగా పలుమార్లు అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయపడిన ఆ యువతి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయింది.

తల్లికి విషయం చెప్పి ఆమె సహకారంతో 2006 జూన్‌లో బంజారాహిల్స్‌ పోలీసుకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు విచారించి ఏఎంఎస్‌జె కోర్టుకు వివరాలు అందించగా, విచారించిన న్యాయమూర్తి నిందితునికి పదేళ్ల జైలు, అతని భార్యకు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

More Telugu News