YSRCP: వివేకా హత్య కేసు: సిట్ తుది నివేదిక ఇవ్వకుండా ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జగన్, వివేకా భార్య సౌభాగ్య

  • దర్యాప్తును ప్రభావితం చేసేలా చంద్రబాబు వ్యాఖ్యలు
  • దర్యాప్తు వివరాలను మీడియాకు వెల్లడించకుండా పోలీసులను ఆపాలని కోరిక
  • స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని అభ్యర్థన

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే ఆరోపిస్తున్నారని, ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేస్తున్న ‘సిట్‌’ తుది నివేదిక దాఖలు చేయకుండా ఆపాలని కోరుతూ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్య, వైసీపీ అధినేత జగన్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.  

వివేకా హత్యకేసు చాలా సున్నితమైన అంశమని కాబట్టి ఎన్నికల జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కేసు వివరాలను మీడియాకు వెల్లడించకుండా పోలీసులను ఆదేశించాలని వైసీపీ అధినేత జగన్, వివేకా భర్య సౌభాగ్య వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జగన్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ .. వివేకా హత్యకేసుకు సీఎం చంద్రబాబు రాజకీయ రంగు పులిమారని ఆరోపించారు. దర్యాప్తును ప్రభావితం చేసేలా విచారణ అధికారులకు మార్గదర్శకాలు సూచిస్తున్నట్టుగా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రే సిట్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో కేసుపై ఆ ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. కేసు దర్యాప్తు సక్రమంగా సాగుతుందన్న నమ్మకం తమకు లేదన్నారు. కాబట్టి ప్రభుత్వ నియంత్రణలో లేని దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని ధర్మాసనాన్ని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. అలాగే, కేసు విచారణకు సంబంధించిన అంశాలను తదుపరి విచారణ వరకు మీడియాకు వెల్లడించకుండా ఉండాలన్న పిటిషనర్ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

More Telugu News