BJP: బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావుపై చీటింగ్ కేసు

  • నామినేటెడ్ పోస్టు ఇస్తామని మోసం
  • కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సంతకం ఫోర్జరీ
  • కోర్టు ఆదేశాల మేరకు మురళీధర్ రావు సహా 9 మందిపై కేసు నమోదు

నామినేటెడ్ పదవి ఇప్పిస్తానంటూ హైదరాబాద్‌కు చెందిన దంపతుల నుంచి రూ.2.17 కోట్లు వసూలు చేసిన ఆరోపణలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావుపై సరూర్‌నగర్ పోలీస్‌లు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులు కాగా అందులో మురళీధర్‌రావు ఏ-8గా ఉన్నారు. కాగా, 2016లోనే ఈ కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు పోర్జరీ కేసు నమోదు చేశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ అపాయింట్‌మెంట్ సృష్టించిన ఆరోపణలపై ఈ కేసు నమోదు చేశారు.

 2015లో చంపాపేటకు చెందిన తాళ్ల మహిపాల్ రెడ్డికి నామినేటెడ్ పదవి కోసం ఆయన భార్య ప్రవర్ణారెడ్డి ఓ జర్నలిస్టు ద్వారా బీజేపీ నేత ఎ.కృష్ణ కిశోర్‌ను కలిశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ద్వారా  ఫార్మా ఎక్సెల్‌ బోర్డు సభ్యుడిగా నామినేటెడ్‌ పదవి ఇప్పిస్తానని ఆయన ఆమెకు హామీ ఇచ్చాడు. ఆయన హామీ మేరకు ప్రవర్ణారెడ్డి పలు విడతల్లో రూ.2.17 కోట్లు ఇచ్చారు.

డబ్బులు తీసుకున్న నిందితులు పదవి ఊసెత్తకపోవడంతో ఆమె ఒత్తిడి పెంచడంతో వారు ఆమెను బెదిరించారు. దీంతో  ఫార్మా ఎక్సెల్‌ చైర్‌పర్సన్‌గా ఆయనకు అవకాశం కల్పిస్తామని ప్రవర్ణకు హామీ ఇస్తూ మంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. విషయం తెలిసిన ప్రవర్ణ 2016లో సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తీసుకున్న సొమ్మును తిరిగి ఇచ్చేస్తామని వారు హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఇవ్వకపోవడంతో ఆమె రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు తాజాగా మురళీధర్‌రావు సహా 9మందిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. 

More Telugu News