kalva srinivasulu: కాల్వ శ్రీనివాసులు నామినేషన్‌పై వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి అభ్యంతరం.. రెండు గంటలపాటు ఉద్రిక్తత

  • కాల్వ నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్
  • అధికారులతోనూ వైసీపీ నేత వాగ్వివాదం
  • రెండు గంటల చర్చల అనంతరం కాల్వ నామినేషన్ ఆమోదం

నామినేషన్ల పరిశీలన సందర్భంగా రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. మంత్రి కాల్వ శ్రీనివాసులు నామినేషన్‌పై వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాల్వ నామినేషన్‌లో రెండు స్థానాలకు మించి పోటీకి సంబంధించి ఇచ్చే డిక్లరేషన్‌లో తప్పులు ఉన్నాయంటూ కాపు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కాల్వ అక్కడే ఉండడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది.

కాల్వ నామినేషన్‌లో తప్పులు ఉన్నాయని, కాబట్టి ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలంటూ అధికారులను కాపు పట్టుబట్టారు. లా చదువుకున్న వ్యక్తిగా చెబుతున్నానని, ఆయన నామినేషన్‌ను తిరస్కరించాల్సిందేనని  పట్టుబట్టారు. దీంతో స్పందించిన ఎన్నికల అధికారులు ఎన్నికల చట్టం ప్రకారం నడుచుకుంటామని ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినిపించుకోని ఆయన వారితోనూ మాటల యుద్ధానికి దిగారు.

ఎన్నికల సంఘం నిర్ణయానికి తాను కట్టుబడివుంటానని కాల్వ చెప్పినా, కాపు రామచంద్రారెడ్డి వినిపించుకోలేదు. దీంతో దాదాపు రెండు గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. తమ మాటలు పట్టించుకోని కాపుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి చట్టానికి లోబడి కాల్వ నామినేషన్‌ను ఆమోదిస్తున్నట్టు అధికారులు చెప్పడంతో కాపు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

More Telugu News