Chandrababu: అసద్, కేసీఆర్, మోదీ... అందరూ రండి, చాపలో చుట్టేసి గోదావరిలో పారేస్తాం!: చంద్రబాబు

  • విభజన వేళ అవమానించారు
  • మనకు రోషం లేదా?
  • నా చెల్లెమ్మలు పోరాడ్డానికి సిద్ధంగా ఉన్నారు

టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలు రోడ్ షోలో మైనారిటీలపై వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా తనతో పాటు వాహనంపైన ఉన్న కశ్మీర్ నేత ఫరూక్ అబ్దుల్లా గురించి చెబుతూ ఆయన మైనారిటీల హక్కుల కోసం పోరాడుతుంటారని కొనియాడారు. కానీ, హైదరాబాద్ లో ఉండే అసదుద్దీన్ రాజకీయ లబ్ది కోసం పాకులాడే వ్యక్తి అని విమర్శించారు. అసద్ మొన్నామధ్య ఆంధ్రాకు వస్తానని బీరాలు పలికారని, అసద్ వచ్చినా తమనేమీ చేయలేడని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

"అసదుద్దీన్ రండి, కేసీఆర్ రండి, మోదీ రండి.. అందరూ రండి, చాపలో చుట్టి గోదావరిలో పారేస్తాం! మన జీవితాలతో ఆడుకున్న వీళ్లను క్షమించకూడదు. విభజన సమయంలో ఎంతో అవమానించారు. ఏంటి, వాళ్లకు మనకు తేడా? కృష్ణా నది దాటి అవతలకు వెళితే మనల్ని దొంగలుగా చూస్తారా? బతకలేక మావూరొచ్చారు అంటూ హీనంగా చూస్తారా? వీళ్లంతా పనికిరాని వాళ్లు, పరిగెత్తించి కొడతాం అంటారు. మనకు రోషం లేదా? మనకు కోపం లేదా? మనల్ని పోలవరం కట్టకూడదంటారు. పర్యావరణం అనుమతులు లేవంటారు. సముద్రంలోకి వెళ్లే నీళ్లు వాడుకుంటే వీళ్లకు బాధేంటో అర్థంకావడంలేదు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు తమ పేపర్లో వేస్తుంటారు... పోలవరం కడితే తెలంగాణ మునిగిపోతుందంట, మనమేదో తప్పు చేశామంట, తెలంగాణ ముంపుకు గురవుతుందంట, చివరికి భద్రాచలం రామాలయం కూడా మునిగిపోయి కొంపలు కూలిపోతాయంట అని రాస్తారు. భద్రాచలం కూడా ఒకప్పుడు మనదే. విభజనలో భద్రాచలం విషయంలో కూడా మనం మోసపోయాం. కానీ ఈరోజు మీపై వీరోచితంగా పోరాడ్డానికి నా చెల్లెళ్లు సిద్ధంగా ఉన్నారు" అంటూ నిప్పులు చెరిగే ప్రసంగం చేశారు.

More Telugu News