India: ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోవాలన్న అధికారులు... నిరాకరించిన అభినందన్!

  • అభినందన్ కు నాలుగు వారాలు రెస్ట్
  • ఇంటికి వెళ్లకుండా శ్రీనగర్ వెళ్లిన పైలట్
  • యుద్ధ విమానాల చెంత విశ్రాంతి

పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని నేలకూల్చి ఆపై తాను బందీగా దొరికిపోయినా, అమోఘమైన ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత వాయుసేన పైలట్ అభినందన్ ఇప్పుడో జాతీయ హీరో అని చెప్పాలి. పాకిస్థాన్ కస్టడీ నుంచి విడుదలైన తర్వాత అభినందన్ కు ఢిల్లీలోని త్రివిధ దళాల ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. అయితే, గాయాల తీవ్రత దృష్ట్యా వైద్యుల సలహా మేరకు అభినందన్ కు ఎయిర్ ఫోర్స్ అధికారులు 4 వారాల విశ్రాంతి ఇచ్చారు. స్వగ్రామానికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని అధికారులు సూచించినా అభినందన్ నిరాకరించాడు.

తమిళనాడులోని సొంతూరికి కాకుండా శ్రీనగర్ లో ఉన్న ఎయిర్ బేస్ కు వెళ్లి అక్కడ యుద్ధ విమానాల చెంత విశ్రాంతి తీసుకున్నాడు. తనకెంతో ఇష్టమైన యుద్ధ విమానాలు, సహచరులతో గడపడమే తనకు ఇష్టం అని చాటుతూ అభినందన్ శ్రీనగర్ లోనే విశ్రాంతి కాలాన్ని పూర్తిచేసుకోనున్నట్టు తెలుస్తోంది. విశ్రాంతి పూర్తయ్యాక, మరికొన్ని రోజుల్లో తదుపరి వైద్య పరీక్షల కోసం ఢిల్లీ రానున్నాడు. ఈసారి అభినందన్ కు ఫిట్ నెస్ టెస్టులు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరీక్షల్లో వచ్చే ఫలితాల ఆధారంగా అభినందన్ తిరిగి యుద్ధ విమానం నడిపే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

More Telugu News