Pawan Kalyan: తెలంగాణ విషయంలో పవన్‌ను మిస్ గైడ్ చేశారు: కోన వెంకట్

  • జనసేన బలోపేతంలో అండగా నిలిచా
  • వైసీపీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నా
  • పవన్‌కు మంచి జరగాలని మౌనంగా ఉన్నా
  • కేసీఆర్ పాలనను మీడియా ముందు పొగిడారు

ఇన్నాళ్లూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించిన ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనను విమర్శించారు. దీంతో కోన వెంకట్‌పై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఇంటర్వ్యూలో కోన విమర్శించారు.

దీనిపై స్పష్టతనిస్తూ కోన ఓ ప్రకటనను విడుదల చేశారు. తమ కుటుంబం తాను పుట్టక ముందు నుంచే బాపట్లలో రాజకీయాల్లో ఉందని తెలిపారు. తన తాత కోన ప్రభాకరరావు కాంగ్రెస్‌ పార్టీలో పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గా, ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, మూడు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఒక్క మచ్చలేని రాజకీయ నాయకుడిగా తన ప్రస్థానం కొనసాగించారని తెలిపారు.

ఆయన మరణం తర్వాత తన బాబాయి కోన రఘుపతి 1995లో ప్రజాసేవలోకి వచ్చారని, తన సొంత ఆస్తులు కరిగించుకుంటూ ప్రజాసేవలో కొనసాగారని తెలిపారు. 2014 ఎన్నికల్లో తమ కుటుంబానికి, కోన రఘుపతికి ఉన్న ప్రజాదరణ గుర్తించి జగన్‌ వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం ఇచ్చారని.. గెలిచామన్నారు. ఈ ఎన్నికల్లో తాను ప్రత్యక్షంగా పాల్గొని తమ వంతు కృషి చేశానన్నారు.

ఆ సందర్భంలో తన మిత్రుడైన పవన్‌ కల్యాణ్‌ కూడా అభినందించారని కోన ప్రకటనలో వెల్లడించారు. 2014 తర్వాత జనసేనని బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లే సందర్భంలో తాను అండగా నిలిచానన్నారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి కూడా తాను విమర్శలు ఎదుర్కొన్నానన్నారు. అయినా ఒక మిత్రుడిగా పవన్‌ కల్యాణ్‌ శ్రేయోభిలాషిగా అతనికి మంచి జరగాలని ఆశించి మౌనంగా ఉండిపోయానన్నారు.

మాయావతితో పొత్తు విషయంలో, తెలంగాణ విషయంలో ఎవరో పవన్ ని మిస్‌ గైడ్‌ చేశారని కోన తెలిపారు. అందుకే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని చెప్పానన్నారు. తాను ఈ విషయం చెప్పడానికి కారణం, కొంత కాలం క్రితం పవన్‌, కేసీఆర్‌ను కలిసిన సందర్భంలో తనే స్వయంగా ఆయన పాలన గురించి మీడియా ముందు పొగిడారని గుర్తు చేశారు.

అందుకే ఇప్పుడు తను ఇస్తున్న ప్రకటనలపై అనుమానం వచ్చిందన్నారు. చివరిగా నేను చెప్పేదేంటంటే, మన రాజకీయ ఆలోచనలు, మన కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆర్థిక స్తోమతలు, ఇవేవీ స్నేహానికి అడ్డుగోడలు కాకూడదన్నారు. పవన్‌ కల్యాణ్‌ తన ప్రయాణంలో అనుకున్నది సాధించాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కోన ప్రకటనలో పేర్కొన్నారు.

More Telugu News