Pawan Kalyan: జనసేన టికెట్లు ఎలా ఇచ్చారో గుండెల మీద చెయ్యేసుకుని చెప్పాలి: పవన్ ను నిలదీసిన మాజీ ఎమ్మెల్యే

  • జనసేన సీట్లు పవన్ కేటాయించిట్టు కనిపించడంలేదు
  • టీడీపీ ప్రభావం ఉందంటూ అనుమానం
  • పంతం గాంధీ తీవ్ర వ్యాఖ్యలు

ఒకప్పుడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన పంతం గాంధీ మోహన్ ఆ తర్వాత జనసేన పార్టీలో చేరారు. చిరంజీవికి సన్నిహితుడిగా పేరుగాంచిన పంతం ఈ ఎన్నికల్లో పెద్దాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయాలని ఆసక్తి చూపించారు. అయితే, జనసేన హైకమాండ్ పెద్దాపురం టికెట్ ను తుమ్మల రామస్వామికి కేటాయించడంతో  దిగ్భ్రాంతికి గురయ్యారు.

తనకు టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన జనసేనకు గుడ్ బై చెప్పేశారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ, జనసేన పార్టీ అభ్యర్థులను పవన్ కల్యాణ్ ఎంపిక చేసినట్టుగా కనిపించడం లేదని, అభ్యర్థుల ఎంపికలో టీడీపీ ప్రభావం ఉందన్న అనుమానాలు వస్తున్నాయని పంతం గాంధీ మోహన్ అన్నారు. జనసేన టికెట్లు ఎలా ఇచ్చారో గుండెల మీద చెయ్యేసుకుని చెప్పాలని నిలదీశారు.

తాను పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి తుమ్మల రామస్వామికి సహకరించబోనని గాంధీ స్పష్టం చేశారు. కనీసం పెద్దాపురంలో ఎవర్ని బరిలో దింపుతున్నారన్న విషయంపై కూడా తనతో సంప్రదించలేదంటూ జనసేన అగ్రనేతలపై ఆయన మండిపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ విలీనం అయ్యాక అందరూ ఆయన్ను వదిలిపోయినా తాను మాత్రం వెన్నంటే ఉన్నానని, చిరంజీవితో ఉన్నందునే తనకు టికెట్ దక్కలేదేమో అని పంతం గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్నయ్య చిరంజీవికి రాజకీయంగా ఎంతో అన్యాయం జరిగిందని చెప్పే పవన్ కల్యాణ్ ఇప్పుడు తనకు జరిగిన అన్యాయంపై ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు.

More Telugu News