Chandrababu: ఒకప్పుడు ఒక హైదరాబాదే... ఇకమీదట 20 హైదరాబాదులు తయారుచేస్తా: చంద్రబాబు

  • కేసీఆర్ రాష్ట్ర ద్రోహి
  • జగన్ తో భవిష్యత్ ఉండదు
  • ఆళ్లగడ్డ రోడ్ షోలో చంద్రబాబు స్పీచ్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రోడ్ షోలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, కరవుకాటకాలు, తుపాన్లు ఇవాళ రాష్ట్రానికి పెద్ద సమస్య కానేకాదని, ప్రతిపక్ష నేత జగన్ మాత్రం రాష్ట్రానికి పెద్ద సమస్యగా మారాడని విమర్శించారు. తెలంగాణ గడ్డపై అడుగుపెడితే కాళ్లు విరగ్గొడతామన్న కేసీఆర్ తో కుమ్మక్కయ్యాడంటూ జగన్ పై మండిపడ్డారు. "పోతిరెడ్డిపాడుకు నీళ్లివ్వడానికి వీల్లేదన్నాడు, ఇటీవల ముచ్చుమర్రి ప్రాజక్ట్ వద్దన్నాడు. సోనియా గాంధీ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని చెబితే, కేసీఆర్ తెలంగాణకు కూడా ఇవ్వాలంటూ అడ్డుతగిలాడు. మోదీ, కేసీఆర్ రాష్ట్ర ద్రోహులు అయితే, వీళ్లతో కలిసిన జగన్ కూడా రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోతాడు. కేసీఆర్, మోదీ అంటే భయపడని మేము జగన్ కు భయపడతామా" అంటూ వ్యాఖ్యానించారు.

జగన్ వంటి నేత ఉంటే భవిష్యత్ ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్ తో జగన్ కలవడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. మన ప్రతిపక్ష పార్టీ పనికిమాలిన పార్టీ అని ఎద్దేవా చేశారు. అంతేకాదు, ఆళ్లగడ్డ సాక్షిగా కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఒకప్పుడు ఒక హైదరాబాద్ ఉంటే ఇకమీదట 20 హైదరాబాదులు తయారుచేస్తానని శపథం చేశారు. ఆళ్లగడ్డ, కర్నూలు పట్టణాలను కూడా భవిష్యత్ లో హైదరాబాద్ స్థాయి నగరాలుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అమరావతి ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తానని అన్నారు. తనకా శక్తి ఉందని స్పష్టం చేశారు.

More Telugu News